nurses protest
-
నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. యాజమాన్యం ఏం చెబుతోందంటే?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ అసుపత్రిలో నర్సులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. ఇంచార్జ్ డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి నిమ్స్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సుల ఆందోళనతో ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది. నర్సుల ధర్నాపై యాజమాన్యం స్పందంచింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి నర్సులు స్ట్రైక్ చేయడం దురదృష్టకరమని కమిటీ మెంబర్ శ్రీ భూషణ్ తెలిపారు. ఎవరికీ చెప్పకుండా ఆందోళన చేస్తున్నారని, కనీసం కారణం కూడా చెప్పడం లేదన్నారు. ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనతో మాట్లాడటానికి ఎవరూ రావడం లేదని తెలిపారు. హెచ్‌వోడీ, డైరెకర్టర్ను దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ‘నర్సుల ధర్నాతో ఆసుపత్రిలో సేవలు ఆగిపోయాయి. ఒకరికి ఇద్దరికీ ఉన్న సమస్య లను అందరికీ ఆపాదిస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారనే కారణం వారికి కూడా తెలియదు. పాత కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. బాధ్యతయుతమైన హోదాలో ఉండి పద్దతి లేకుండా విధులు బహిష్కరణ చేశారు. నర్సుల ఆందోళనతో ఆపరేషన్ థియేటర్స్ లో పిల్లలు ఆపరేషన్ కోసం ఫాస్టింగ్‌తో ఉన్నారు. ఇప్పుడు వారి తల్లదండ్రులకు ఏం చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 1400 మంది రోగులు ఉన్నారని, ఎంతో మంది పేషెంట్లకు వారి అవసరం ఉందని ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ఒక స్ట్రైక్ చేయాలంటే పద్దతి ఉంటుందని.. ఒకరిద్దరికీ మెమో ఇస్తే అందరూ సమ్మె చేయడం ఏంటని మండిపడ్డారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నానని. రోజూ ప్రతి ఒక్కరినీ కలుస్తున్నానని తెలిపారు. తాను ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి ఫేవరేటిజం ఉండదని స్పష్టం చేశారు. నర్సుల సమస్యల వినడానికి ఉదయం 9:30 నుంచి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నిరసనలో కూర్చున్న చాలా మందికి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో కూడా తెలియదు. ఇవాళ స్ట్రైక్ చేయాలి అని చెప్తే చేస్తున్నారు. ముగ్గురుకి ఇచ్చిన మెమోల కారణంగా అందరినీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఒక నర్సు ఏడాదిలో 143 రోజులు ఆలస్యంగా వచ్చారు. అది రిజిష్టర్‌లో రికార్డు కాలేదు. అందుకే మెమో ఇచ్చాం. మరో నర్సు 19 రోజులు రాలేదు. కానీ సీఎల్ లీవులు వాడలేదు. అందుకే మెమోలు ఇచ్చాం’ అని తెలిపారు. -
నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన బాలకృష్ణ
సాక్షి, విజయవాడ: ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్‌స్టాపబుల్ అనే కార్యక్రమంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సులు నిరసనలు తెలుపుతున్నారు. కాగా, నిరసనల సందర్భంగా నర్సులు బాలకృష్ణ, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బాలకృష్ణ వ్యాఖ్యలను సమర్థించిన పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. నర్సులను బాలకృష్ణ కించపరిస్తే పవన్ ఎందుకు ఖండించలేదు?. మహిళలకు పవన్ కల్యాణ్ ఏం న్యాయం చేస్తాడు?. బాలకృష్ణ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కరోనా సమయంలో కుటుంబాలను వదిలి, ప్రాణాలకు తెగించి సేవ చేశాము. నర్సింగ్ ప్రొఫెషన్‌ను తక్కువ చేసి చూడకండి అని కోరారు. ఇక, తన వ్యాఖ్యలపై తాజాగా బాలకృష్ణ స్పందించి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. నా వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రోగులకు సేవలు అందించే నర్సులంటే తనకు గౌరవం అని తెలిపారు. నర్సుల మనోభావాలు దెబ్బతిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
Photo Feature: ఆర్టీసీ వినూత్న ఆలోచన.. నర్సుల నిరసన
ఖమ్మం ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. పాత బస్సును ప్రయాణికులకు బస్ షెల్టర్‌గా మార్చారు. ఊరించి మొహం చాటేసిన వర్షాల కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వేతన సవరణ కోసం ముంబైలో నర్సులు ఆందోళనబాట పట్టారు. ఇక, మరాఠా రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో ఆందోళన కొనసాగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
-
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్‌ల కింద రూ.750 ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. (గాంధీలో నిరవధిక సమ్మె) చదవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం -
హైదరాబాద్‌లో నర్సుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 150మంది నర్సులు ఆందోళనకు దిగారు. ‘టిమ్స్’లో కరోనా సేవల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపడతామని చెప్పిన అధికారులు మాట తప్పారంటూ నిరసన చేపట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న తమను నోటిఫికేషన్ అంటూ తీసుకొచ్చి రోడ్డున పడేశారని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతి అంటూ తమని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. నర్సులు తమ ఆందోళనను కొనసాగిస్తూ... తమ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని డిమాండ్ చేశారు.(చదవండి : ‘హైదరాబాద్ నగరాన్ని గాలికొదిలేశారు’) -
వైద్యుని దురుసు ప్రవర్తనపై ఆందోళన
ఇచ్ఛాపురం: వైద్యుని దురుసు ప్రవర్తనపై విసిగివేశారిన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సి బ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. ఇక్కడ అతనుంటే తాము విధులు నిర్వర్తించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇక్కడ డిప్యూటీ సివిల్ సర్జన్‌గా గత శనివారం డాక్టర్ అత్తోటి రవీంద్రకుమార్ విధుల్లోకి చేరారు. అప్పట్నుంచి రోగుల ఎదుట సదరు సిబ్బందిని ఇష్టానుసారంగా తిట్టడం, కొ ట్టడానికి చేయిఎత్తడం వంటి చేష్టలు చేస్తున్నారు. నైట్ డ్యూ టీలను సక్రమంగా చేయనివ్వడంలేదని హెడ్ స్టాఫ్ శమంతకమణి, ఉమ, శైలజ, జ్యోతి, శారద, విద్య, ధనలక్ష్మి వాపోయారు. ఈ నేపథ్యంలో ఈయన వ్యవహార శైలి మార్చుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా సదరు వైద్యుణ్ని హెచ్చరించారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఆసుపత్రి చైర్మన్ జగన్నాథంతోపాటు ఆసుపత్రి వైద్యాధికారి దామోదర్ప్రధాన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్లామని, విధుల్లోకి చేరాలని చెప్పడంతో ఆసుపత్రి సిబ్బంది శాంతించారు. -
రిమ్స్‌లో నర్సుల ఆందోళన
ఆదిలాబాద్ : నర్సుల బదిలీలను 20 శాతానికి కుదించడాన్ని నిరసిస్తూ రిమ్స్ ఆస్పత్రి నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు యత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరికొందరు రిమ్స్‌భవనం ఎక్కి నిరసన తెలిపారు. ఆందోళన సమాచారం అందుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, రిమ్స్ డైరెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం రిమ్స్ సిబ్బందిపై వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల నుంచి రిమ్స్‌లోనే పనిచేస్తున్నామని, కుటుంబాలకు దూరంగా గడుపుతున్నామన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లు 40 శాతం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బదిలీల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది పద్మ, వినోద, కరుణ, వేరోనిక, సరిత, తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో నర్సుల ఆందోళన
వరంగల్ అర్బన్: ఎంజీఎం ఆస్పత్రిలో నర్సులు ధర్నాకు దిగారు. అకారణంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తమను దూషించాడని నిరసనగా.. గురువారం విధులను బహిష్కరించిన నర్సులు ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో నర్సుల సేవలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.