క్రీనీడ
ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేతలు తమను గెలిపిస్తే ప్రజలకెన్నో చేస్తామని చెప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు. హామీలు గుప్పించి ప్రజలను ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు స్క్రిప్టులు తయారు చేసుకుంటున్నారు.
కానీ.. పాత హామీల సంగతేంటి? నగరవ్యాప్తంగా పలు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. బస్‌షెల్టర్ల నిర్మాణం. ఈ నేతల ఆదేశాల వల్లే ప్రజల కోసం ఏర్పాటు చేయాలనుకున్న బస్‌షెల్టర్లకు ఏడాది కాలంగా గ్రహణం పట్టింది. వారి ఆజ్ఞల వల్లే వేయాలనుకున్న ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు వేయలేకపోయారు. ఫలితంగా ఎంతో కాలంగా ప్రజలు సకాలంలో రాని బస్సుల కోసం ఎదురు చూస్తూ.. ఎండలకు ఎండి వానలకు తడిచారు.
రాజకీయ జోక్యంతో ఏర్పాటు కాకుండా పోయిన బస్ షెల్టర్ల గ్రహణం కథ ఇదీ..!
ఆర్టీసీ అంచనాల మేరకు నగర ప్రయాణికులకు దాదాపు రెండువేల బస్‌షెల్టర్లు అవసరం. అందులో సగం మాత్రమే ఉన్నాయి. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు 558 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు ఏడాది క్రితం జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఐదు ప్యాకేజీలుగా ఈ టెండర్లను పిలవగా.. వాటిలో రెండు ప్యాకేజీలకు సరైన టెండర్లే రాలేదు. మిగతా మూడు ప్యాకేజీల్లో 330 బస్‌షెల్టర్ల ఏర్పాటుకు అర్హత పొందిన కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. టెండరు పొందిన సంస్థ పది నెలల్లోగా సదరు షెల్టర్లు ఏర్పాటు చేయాలి. కానీ.. దాదాపు వంద ప్రాంతాల్లో షెల్టర్ల ఏర్పాటకు తగిన స్థలాన్ని జీహెచ్‌ఎంసీ ఇంతవరకూ కాంట్రాక్టు సంస్థకు అప్పగించలేకపోయింది.
అందుకు పలు కారణాలుండగా.. వాటిలో రాజకీయ ఒత్తిళ్లదే ప్రథమస్థానం. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు తమ సంస్థల ఎదుట షెల్టర్లకు ససేమిరా అనగా, వారికి వత్తాసు పలుకుతూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. అడ్డుకునేందుకు ఆదేశాలు జారీ చేసిన వారిలో కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి నేతల వరకు ఉన్నారు. వారికి ఎదురు చెప్పలేని జీహెచ్‌ఎంసీ చేష్టలుడిగి చూడటం మినహా ఏమీ చేయలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన జీహెచ్‌ఎంసీ.. ఈ సీజన్‌లోనైనా వాటి ఏర్పాటుకు పూనుకుంటే ఫలితముంటుందేమో.. ఎన్నికల కోడ్‌లోనైనా షెల్టర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సదుపాయం కలుగుతుంది. వచ్చే వేసవిలో కాసింత నీడ దొరుకుతుంది. అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది.
పేరుకే గొప్ప..
‘గ్రేటర్’లో ప్రతి రోజు 3800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులు 13 వందల రూట్లలో, రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున తిరుగుతున్నాయి. 32 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ గణాంకాలను చూపి గొప్పలు చెప్పుకొంటున్న ఆర్టీసీ కానీ.. మెరుగైన సేవలందిస్తామంటున్న జీహెచ్‌ఎంసీ కానీ.. సగటు ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రాబల్యానికి తలొగ్గి బస్టాపుల నిర్మాణాన్ని గాలికొదిలేశాయి. ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు ఇదే దుస్థితి. ఇప్పటికే ఉన్న బస్టాపుల్లోనూ ప్రజలకు ఉపయోగపడుతున్నవి తక్కువే. ప్రకటనల ద్వారా లాభాలార్జించే యాడ్‌ఏజెన్సీల కోసం ఏర్పాటు చేసినవే ఎక్కువ.
మరికొన్ని చిరువ్యాపారుల అడ్డాలుగా మారాయి. ఇంకొన్ని యాచకుల కేంద్రాలుగా మారాయి. ప్రజలు వినియోగించుకుంటున్నవి సైతం సదుపాయంగా లేవు. రాత్రివేళల్లో దీపాల్లేనివి.. కూర్చునేందుకు కుర్చీలు లేనివి.. పేరుకే బస్‌షెల్టర్‌గా మారినవి.. వీటిలో ఉన్నాయి.