శ్రీకాకుళం: తెలుగుదేశం నేతలు కబ్జాపర్వానికి తెరతీశారు. ఆర్టీసీ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం బ్యారేజీ సెంటర్ మూడు రహదారులకు జంక్షన్ కావడంతో(2018 –19) టీడీపీ హయాంలో బస్ షెల్టర్ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.లక్షన్నర నిధులు కేటాయించారు.
లోతట్టు ప్రాంతం కావడంతో పిల్లర్లు, బేస్‌మెంట్ శ్లాబ్ వేసి విడిచిపెట్టారు. అప్పటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలో నిలిపివేశారు. తర్వాత కొద్దిరోజులకే ఎన్నికలు జరగడంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఆరేళ్లుగా అసంపూర్తి ఉన్న ఈ నిర్మాణంపై టీడీపీ నాయకుడు, ఎంపీటీసీ భర్త కన్ను పడింది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సర్పంచ్ భర్త సహకారం తీసుకుని తనదే భూమి అన్నట్టు వ్యవహరించడం ప్రారంభించాడు.
అసంపూర్తిగా ఉన్న బస్‌షెల్టర్ చుట్టూ సిమెంట్ ఇటుకలతో గోడల నిర్మాణానికి పూనుకున్నాడు. దీనిపై కొందరు స్థానికులు ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్‌అండ్‌బీ ఏఈ పోలీసుల సహకారంతో చేరుకుని పనులు నిలిపివేయించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆక్రమణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాగైనా స్థలం స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు.
దీనిలో భాగంగా రాత్రిపూట బస్‌షెల్టర్ పిల్లర్ల చుట్టూ గోడలు కడుతున్నారు. సమీపంలోని కొంత ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించి గదులు కట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రాత్రికి రాత్రే దర్శనమిస్తున్న నిర్మాణాలతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఇక్కడ ఆక్రమణల్లో ఉన్న భూమి విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే భూమి మొత్తం ఆక్రమిస్తారని, ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నోటీసులు ఇస్తాం..
ఈ విషయమై తహసీల్దారు మురళీమోహన్ వద్ద ప్రస్తావించగా బస్‌షెల్టర్ అక్రమ నిర్మాణం విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇప్పటికే ఆర్‌ఐ, సర్వేయర్లును పంపించి సర్వే చేయించామని చెప్పారు. ఆ స్థలం మేజర్ పంచాయతీ పరిధిలోకి వస్తుందన్నారు. పంచాయతీ అధికారుల ద్వారా సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి: మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
Comments
Please login to add a commentAdd a comment