
పలాసలో ఇద్దరు బాలికలపై అత్యాచారం
నిందితులూ మైనర్లే
పుట్టిన రోజు వేడుకలకు తీసుకెళ్లి అఘాయిత్యం
కాశీబుగ్గ పోలీసుల అదుపులో నిందితులు
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఉలిక్కిపడింది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలపై లైంగికదాడి జరిగిందనే విషయం వెలుగు చూడడంతో జంట పట్టణాల్లో కలకలం రేగింది. ఈ కేసులో నిందితులు కూడా మైనర్లే కావడం గమనార్హం. కాశీబుగ్గకు చెందిన పదహారేళ్ల వయసు నిండిన ముగ్గురు బాలికలను అదే వయసు కలిగిన ముగ్గురు బాలురు పుట్టినరోజు వేడుకలకు పిలిచి వారిలో ఇద్దరిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కౌమార దశలోనే మద్యపానం అలవాటు చేసుకోవడం, మైనర్లు అని తెలిసినా వారికి మద్యం విక్రయించడం వంటి లోపాలు ఈ అకృత్యంతో బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
కాశీబుగ్గ: మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బాలురులో ఒకరి పుట్టిన రోజు కావడంతో ఈ నెల 19న వారు ముగ్గురు బాలికలతో బయటకు వెళ్లారు. ఈ ముగ్గురు బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 19న రాత్రి ఈ ఆరుగురు కలిసి పలాస సినిమా థియేటర్ సమీపంలో బిర్యానీలు, కేక్‌లు, గిఫ్ట్‌లు, మద్యం పట్టుకుని బైక్‌లపై జంట పట్టణాలను దాటి వెళ్లారు. పట్టణానికి దూరంగామనుషుల అలికిడి లేని ప్రాంతానికి చేరుకుని పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి మద్యం సేవించినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లపై ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు.
మరో బాలికతోనూ చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. లైంగికదాడిని వీడియో రికార్డు చేసుకున్నారు. అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ ఇళ్లకు చేరుకున్నా రు. ఆదివారం ఉదయం మూడో బాలిక తన తల్లిదండ్రుల వద్ద ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. మిగతా ఇద్దరు బాలికల తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో వారు పరువు పోతుందని మిన్నకుండిపోయారు.
అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మా యి అనారోగ్యానికి గురి కావడం, సోమవారానికి కూడా స్పృహలోకి రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సీఐ మోహనరావు ఫిర్యాదును తీసుకుని కేసును ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ/కాశీబుగ్గ డీఎస్పీ శ్రీనివాసరావుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అయితే నిందితుల్లో ఒకరు మేజర్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని రాజీ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. బాధితుల ఇళ్ల వద్దకు చైల్డ్‌లైన్ వారు సైతం వెళ్లి వాకబు చేస్తున్నారు.
నిందితుల్ని గుర్తించారు : ఎమ్మెల్యే
పలాసలో నాటుకుపోయిన గంజాయి సంస్కృతే ఈ అకృత్యాలకు కారణమని, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి సమయం పడుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె మాట్లాడారు. బాధితు ల తల్లిని కలిశామని, పుట్టిన రోజు వేడుకల నుంచి ఆదివారం వచ్చిన చిన్నపాప సోమవారానికి కూడా ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయకూడదని, ఎలాంటి సెటిల్‌మెంట్లు చేయకూడదని అన్నారు. నిందితులను గుర్తించారని, కులం, పార్టీ, స్థాయి చూడకుండా శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment