మహిళలకు పోలీస్‌స్టేషన్‌లోనూ కొరవడిన భద్రత
ఎస్పీకి ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్
గుట్టుచప్పుడు కాకుండా విచారణ
ఆమదాలవలస/శ్రీకాకుళం క్రైమ్: మహిళలకు రక్షణ దొరికే చోటు అంటూ ఏదీ లేకుండాపోతోంది. ఆఖరికి పోలీస్‌స్టేషన్‌లోనూ అక్కడి మహిళా సిబ్బందికే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. తన డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్న కిందస్థాయి మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం జిల్లాలో కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దూకుడుగా వెళ్తూ పోలీసు శాఖపై ఉన్న మచ్చలను తుడిచే ప్రయత్నం చేస్తుంటే.. కొందరు అధికారుల వైఖరి ఆ శాఖ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఆ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ మహిళా కానిస్టేబుల్ జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ సివిల్ కేసు విషయమై బయటకు వెళ్లేటప్పుడు ఇలా ప్రవర్తించడంతో పాటు అంతకుముందు సైతం లైంగికంగా వేధించినట్లు చెప్పింది. ఇది జరిగి నాలుగు రోజులవుతోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా విచారణ చేయించారు. అయితే గురువారం ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.
అభియోగాలు ఎన్నో..
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆమదాలవలస ఎస్‌ఐపై ఇదివరకు కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. న్యాయం చేయాలని స్టేషన్‌ను ఆశ్రయించిన వారిని టార్గెట్ చేస్తూ పలు సెటిల్‌మెంట్‌లు చేసినట్లు సమాచారం. ఆమదాలవలసకు బదిలీపై వచ్చిన నుంచి తన ప్రైవేటు వాహనానికి ఒక యువకుడిని డ్రైవర్‌గా మందస ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. ఆయన్ని ఇక్కడ మైత్రి కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినట్లు స్థానికులకు పరిచయం చేసి స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల వద్ద కలెక్షన్‌లు చేసేందుకు ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ స్థానికంగా ఒక ఆర్‌ఎంపీ వైద్యుని దగ్గర వైద్యం పొంది మందులు రియాక్షన్ ఇవ్వడంతో మృతిచెందాడు. ఆ ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద కూడా రూ.లక్షల్లో మొత్తా న్ని వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కలెక్షన్ కింగ్..
ఎస్‌ఐ ఈ స్టేషన్‌కు వచ్చి కొన్ని నెలలే అయినప్పటికీ.. ఇదే పోలీస్‌స్టేషన్‌లో గత ఎనిమిదేళ్లుగా మైత్రి మల్లేశ్వరరావు వెన్నుదన్నుగా ఉండి కలెక్షన్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వెలువడుతున్నాయి. ఖైనీ, గుట్కాలు, గంజాయి రవాణా చేసేవారు, పట్టణంలో కృష్ణాపురం, అక్కులపేట, గాజులకొల్లివలస కొండపైన, సుగర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో పేకాటరాయుళ్లు మైత్రి మల్లేశ్వరరావుకు కలెక్షన్‌లు తీసుకువచ్చి ఇస్తుంటారని, అవి ఎస్‌ఐకు చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం టూటౌన్‌లో సైతం ఇలాంటి ఆరోపణలే ప్రజల నుంచి రావడం విశేషం.
ఎస్‌ఐ ఏమన్నారంటే..
పై విషయాలపై నిందారోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఐదు రోజుల ముందు కేసు విషయమై బయటకు వెళ్లిన మాట వాస్తవమేనని, తాను ఇదివరకు పనిచేసిన ఏ పోలీస్‌స్టేసన్‌లో ఏ మహిళ పట్లా ఇలా ప్రవర్తించలేదని, ఈమైపె కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నా రు. దీనిపై ఇప్పటికే ఎంకై ్వరీలో తన తప్పేం లేదని తెలిసిందని, ఎవరో కొంతమంది గిట్టని వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఏ స్టేషన్‌లో ఎలాంటి కలెక్షన్లకు పాల్పడలేదని అన్నారు.
ఎస్పీ ఏమన్నారంటే..
ఇదే విషయమై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా తన నోటీస్‌కు మహిళా కానిస్టేబుల్ అంశం వచ్చిందని, విచారణ చేస్తున్నామన్నారు. ఎస్‌ఐ వివిధ స్టేషన్లలో చేస్తున్న కలెక్షన్ల విషయమై తమకు ఎలాంటి సమాచారం రాలేదని, తమ నోటీస్‌లోకి వస్తే విచారణ జరిపి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment