తిరుపతి - హౌరా ఏసీ ప్రత్యేక రైలు
- అక్టోబర్ 5 నుంచి ప్రారంభం
తిరుపతి : దసరా పండుగను పురస్కరించుకుని తిరుపతి నుంచి విజయవాడ మీదుగా హౌరా(కోల్‌కతా) వరకు పూర్తిస్థాయి ఏసీ ప్రత్యేక వారాంతపు రైలును నడపనున్నట్లు తిరుపతి చీఫ్ రిజర్వేషన్ ఇన్‌స్పెక్టర్(సీఆర్‌ఐ) ఎ.ఏలియా ఆదివారం 'సాక్షి' కి తెలిపారు.
02858 నెంబరు గల ఈ రైలు అక్టోబర్-5 నుంచి ప్రారంభమై నవంబర్-16వ తేదీ వరకు నడుస్తుందన్నారు. ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ రైలును కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు. సెలవులు, తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి రావడానికి ఏర్పడే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏసీ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడల మీదుగా హౌరా వరకు నడుస్తుందన్నారు.
ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:55 గంటలకు తిరుపతిలో బయల్దేరి అదేరోజు రాత్రి 10:05 గంటలకు విజయవాడ, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హౌరాకు చేరుకుంటుందన్నారు. రైలులో మొత్తం 14 థర్డ్‌క్లాస్ ఏసీ బోగీలుంటాయన్నారు. తిరుపతి నుంచి విజయవాడ వరకు టికెట్ ధర రూ.1,070 గా అధికారులు నిర్ణయించారని పేర్కొన్నారు. కాగా తిరుగు ప్రయాణంలో 02855 నెంబరుతో అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు హౌరాలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. ఈ రైలుకు సోమవారం నుంచి రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.