సాక్షి, అన్నానగర్: తమిళనాడులోని కోవై నుంచి చెన్నైకు వస్తున్న చేరన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. చెన్నై సెంట్రల్-కోయంబత్తూరు మధ్య నడిచే చేరన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12674) గురువారం రాత్రి కోవై నుంచి చెన్నైకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్‌కు సమీపిస్తుండగా బి-3 ఏసీ బోగీలోని ఒక ప్రయాణికుడు తన లగేజీని తీసుకుంటుండగా బెర్త్ కింద పాము కనిపించింది. భయాందోళన చెందిన అతను కేకలు పెట్టాడు. అతడి అరుపులు విని ఇతర ప్రయాణికులు కూడా కేకలు పెడుతూ పరుగులు తీశారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో చెన్నై సెంట్రల్ స్టేషన్ రావడంతో బోగీలోని ప్రయాణికలు తమ లగేజీలు తీసుకుని దిగారు. కాగా, ఏసీ బోగీలో పాము ఉందని, దాన్ని తొలగించామని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ చెప్పారు. అయితే అది అక్కడకు ఎలా వచ్చిందో తెలియలేదని, విచారిస్తున్నట్టు తెలిపారు. అది పొడవైనదిగాను, విషపామువలే ఉందని ఆ బోగీలో ఉన్న భువన అనే ప్రయాణికురాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment