
ప్చ్..టైం బాగాలేదు
- ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల పెదవి విరుపు
- ఏసీ బెర్తులకు టికెట్ ఛార్జీల సెగ
విశాఖపట్నం సిటీ: విశాఖ-ఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. రెండు పగటి సమయాలు రైల్లోనే గడిచిపోతున్నాయని, ఒక రాత్రి రైల్లోనూ, రైలు దిగిన ఒక రాత్రి ఢిల్లీలో గడిచిపోతుందని వీరంటున్నారు. రెండు రోజులు పూర్తిగా వృధా అవుతోంది. రాత్రి వేళ విశాఖలోబయల్దేరి మరసటి రోజు తెల్లవారు జామున ఢిల్లీకి చేరుకునేలా వేళలను సవరిస్తే ఢిల్లీకి వెళ్లే వారికి ఉపయోగపడుతుందనే భావన వెలిబుచ్చుతున్నారు. ఢిల్లీలో కూడా రాత్రి రైలు బయల్దేరి తిరిగి విశాఖకు పగటి పూట చేరుకునేలా ప్రయత్నిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లే వారిలో వ్యాపారస్తులతో పాటు కోర్టు కేసుల నిమిత్తం వెళ్లే న్యాయవాదులు, కక్షిదారులుంటారు. వివిధ పరిశ్రమలకు అనుమతుల కోసం వెళ్లే పారిశ్రామిక వేత్తలు, రాజకీయ అనుచరులు భారీగా ఉంటారు. వీరంతా దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి, అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లపైనే ఆశ పెట్టుకున్నారు. ఆ రైళ్లకు చాంతాడంత క్యూ ఉండడంతో తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ఆధారపడతారు.
బెర్తులు ఖాళీ : వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చే నాలుగు మాసాలకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ తెరిచారు. రెండు వైపులా ప్రయాణానికి అనుకూలంగా కావ ల్సినన్ని బెర్తులు ఉండడంతో ప్రయాణికులు ఉత్సాహంగా ఎగబడ్డారు. అన్నీ ఏసీ బెర్తులే కావడంతో ధరలు కాస్త వణుకు పుట్టిస్తున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఛార్జీలు భారీగా ఉన్నాయి. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే రూ. 200 నుంచి రూ.500 వరకూ వ్యత్యాసం కనిపిస్తోంది. లింక్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లతో పోల్చుకుంటే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు స్వల్పంగానే ధరలు పెంచినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే ఈ రైలు నేరుగా న్యూ ఢిల్లీకి వెళుతుందనే కారణం చెబుతున్నాయి. థర్డ్ ఏసీ బెర్తు రూ. 2 వేలు, సెకండ్ ఏసీ బెర్తు-రూ.2935, ఫస్టు ఏసీ బెర్తు రూ. 5070గా ఉంది. అంటే ఫస్టు ఏసీ ఛార్జీతో విమానంలోనే హాయిగా వెళ్లిపోవచ్చని ప్రయాణికులు అంటున్నారు.