సాక్షి, హైదరాబాద్: ఏసీ బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి టికెట్‌పై రూ.30 చొప్పున పెంచింది. ఏసీ స్లీపర్ సర్వీసు లహరి, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సుల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ ప్యాకెట్‌ను అందించటాన్ని ప్రారంభించిన ఆర్టీసీ, ఆ తినుబండారాల చార్జీ రూపంలో రూ.30 చొప్పున పెంచుతూ టికెట్ ధరలను సవరించింది.
ఈ కొత్త ధరలను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి అమలులోకి తెచ్చింది. చిరు ధాన్యాలతో స్నాక్స్ రూపొందించే ట్రూ గుడ్ అన్న సంస్థతో ఇటీవలే ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ప్రయాణికులకు సరఫరా చేస్తోంది.
నో ఛాయిస్..
సాధారణంగా ఇలాంటి తినుబండారాలను అందించేటప్పుడు ప్రయాణికుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల సూపర్ లగ్జరీ బస్సుల్లో అరలీటరు మంచినీటి సీసాను అందించే నిర్ణయం తీసుకున్నప్పుడు రూ.10 చొçప్పున టికెట్ ధరను పెంచిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, కచ్చితంగా పెంచిన ధరను చెల్లించేలా అమలులోకి తెచ్చింది. ఇప్పుడు కూడా, స్నాక్స్ ప్యాకెట్‌ను విధిగా తీసుకోవాల్సిందే. టికెట్‌లోనే దాని ధరను చేర్చినందున స్నాక్స్ ప్యాకెట్ రుసుమును కచ్చితంగా చెల్లించాల్సినట్టవుతుంది.
ఏముంటాయంటే..
టికెట్ తీసుకోగానే ప్రయాణికుడికి ఓ ప్యాకెట్ ఇస్తారు. ట్రూ గుడ్–ఆర్టీసీ సంయుక్త వివరాలతో ఈ ప్యా కెట్‌లను రూపొందించారు. ఆ ప్యాకెట్‌లో చిరుధాన్యా లతో రూపొందించిన 25 గ్రాముల మురుకులు/కా రప్పూస, పప్పు చెక్క, సేగు (ఇవి ఒక్కో ప్యాకెట్‌లో ఒ క్కోరకం ఉంటుంది), 20 గ్రాముల మిల్లెట్ చిక్కీ, ఒక మిల్లెట్ రస్‌్కలతో కూడిన విడివిడి ప్యాకెట్లు ఉంటా యి. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలతో రూపొందించిన చిరుతిండిని అందించాలని నిర్ణయిం చినట్టు గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
‘స్నాక్స్’వల్ల పెరిగే ఆదాయం ఏమేరకు?
ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సుల్లో నిత్యం దాదాపు 16 వేల నుంచి 18 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.30 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నందున ఆర్టీసీకి నెలకు రూ.కోటిన్నర వరకు ఆదాయం పెరుగుతుంది. అయితే, తయారీ కంపెనీ నుంచి ఒక్కో ప్యాకెట్‌పై ఆర్టీసీ రూ.18 వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన దీన్ని పెద్ద ఆదాయంగా పరగణించాల్సిన అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment