సాక్షి, సిటీబ్యూరో: నిప్పులు కురిసే ఎండల్లోనూ చల్లటి ప్రయాణం. ఎలాంటి కుదుపులు లేకుండా సాగిపోయే సాఫీ జర్నీ. నాలుగు ప్రధాన మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సదుపాయం. పైగా 24 గంటలూ అందుబాటులో ఉండే బస్సులు. అయినా ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. గతంలో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించిన గ్రేటర్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల స్థానంలో రెండు నెలల క్రితం అత్యాధునికసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడుపుతున్న ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. వీటిపై వచ్చే ఆదాయంవాటి అద్దె చెల్లింపులకు కూడా సరిపోవడం లేదని ఆర్టీసీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నడిచిన మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల కంటే కూడాఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో తక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. పర్యావరణహిత రవాణాసదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకితీసుకొచ్చే లక్ష్యంతో 40 ఎలక్ట్రిక్ బ్యాటరీబస్సులను గ్రేటర్ ఆర్టీసీ ఎయిర్‌పోర్టు మార్గంలో నడుపుతోంది. దశలవారీగా నగరంలోని మిగతా మార్గాల్లోనూ వీటిని నడపాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కానీ ఎయిర్‌పోర్టు రూట్ బస్సుల్లో పెద్దగా ఆదాయం లభించకపోవడం, అది బస్సుల అద్దెలకు కూడా సరిపోకపోవడంతో ఆర్టీసీ అధికారులు వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణను చూరగొనేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై దృష్టి సారించారు. గతంలో కంటే ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రయాణికులు పెరిగితే తప్ప ఆ బస్సులకు మనుగడ ఉండబోదు.
ట్రిప్పులు పెరిగినా...
బీహెచ్‌ఈఎల్ నుంచి గచ్చిబౌలి, ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కొన్ని బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా, జేఎన్‌టీయూ నుంచి మెహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే నుంచి మరికొన్ని బస్సులు తిరుగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా కొన్ని బస్సులు, సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, మెహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో మరికొన్ని బస్సులు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, జేఎన్‌టీయూ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.255 చొప్పున చార్జీ ఉంది. బీహెచ్‌ఈఎల్ నుంచి మాత్రం రూ.280 ఉంది. జేఎన్‌టీయూ, బీహెచ్‌ఈల్ రూట్లలో గతంలో 40 ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు 55కు పెంచారు. సికింద్రాబాద్ రూట్‌లోనూ ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ప్రయాణికులు మాత్రం తగ్గారు. గతంలో 60శాతం ఆక్యుపెన్సీతో తిరిగిన బస్సులు ఇప్పుడు 45 శాతానికి పడిపోయినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఒక కిలోమీటర్‌పై వచ్చే ఆదాయం కూడా గతంలో రూ.50 ఉంటే, ఇప్పుడు రూ.37కు పడిపోయింది. ఇందులో ఒక కిలోమీటర్‌కు రూ.33 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఇక విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా ఆర్టీసీకి అదనపు భారమే.
మెట్రో గండం...
మరోవైపు ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు మరో 18 ఏసీ బస్సులు నడుపుతున్నారు. ఈసీఐఎల్ నుంచి హైటెక్ సిటీకి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రాకతో ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. లింగంపల్లి, ఆల్విన్‌కాలనీ, కొండాపూర్, శిల్పారామం, జూబ్లీహిల్స్, పంజగుట్ట, లక్డీకాపూల్, కోఠి, ఎల్‌బీనగర్ మార్గంలో రాకపోకలు సాగించే ఏసీ బస్సులు నిరాదరణకు గురవుతున్నాయి. ఒకప్పుడు సుమారు 65శాతం ఆక్యుపెన్సీతో నడిచిన ఈ బస్సుల్లో ఇప్పుడు పట్టుమని 30 మంది కూడా ప్రయాణం చేయడం లేదు. చాలా వరకు మెట్రో రైళ్లలోనే పయనిస్తున్నారు. అలాగే ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. మెట్రో మార్గాలకు సమాంతరంగా నడిచే ఏసీ బస్సులను ఇతర మార్గాలకు మళ్లించే అంశంపై ఆర్టీసీ అధ్యయనం చేపట్టింది. మెట్రో అందుబాటులో లేని నగర శివారు రూట్లపైన అధికారులు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment