సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెండు రోజుల క్రితం ఆకస్మాత్తుగా స్తంభించాయి. డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బయలుదేరే విమానాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవలసి వచ్చింది. అలాగే విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకోవలసిన వాళ్లకు సైతం ఇబ్బందులు తప్పలేదు. అప్పటికప్పుడు ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితమే కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పర్యావరణ హితమైన 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రోడ్డెక్కి ఆరు నెలలు కూడా గడవకుండానే తరచుగా సమస్యలు తలెత్తుతున్నాయి.బస్సుల నిర్వహణలో వివిధ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేయకుండా ప్రైవేట్‌సంస్థలపైన ఆధారపడి బస్సులను నడపడం వల్ల ప్రయాణికుల ఆదరణను కోల్పోవలసి వస్తుందని వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఏసీ బస్సులపై పెద్దగా ఆదాయం రాకపోయినా ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఒప్పందం ప్రకారం అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ బస్సుల నిర్వహణలో దారుణమైన నష్టాలను భరించాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు సంస్థల మధ్య సమన్వయం ఎలా.
ఎలక్ట్రిక్ బస్సులపైన ఆర్టీసీకి ఒలెక్ట్రా సంస్థకు గత సంవత్సరం కుదిరిన ఒప్పందం ప్రకారం 40 బస్సులను ప్రవేశపెట్టారు. ఈ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు మాత్రం భగీరథ అనే సంస్థకు చెందిన వారు. సుమారు 95 మంది డ్రైవర్లను భగీరథ సంస్థ ఒలెక్ట్రాకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా అందజేసింది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే సంస్థగా ఆర్టీసీ వ్యవహరిస్తుండగా, ఆర్టీసీకి కావలసిన బస్సులను ఒలెక్ట్రా అందజేస్తోంది. కానీ ఆ సంస్థకు సొంతంగా సిబ్బంది లేకపోవడంతో భగీరథ అనే మరో సంస్థ నుంచి డ్రైవర్లను తీసుకుంది. ఇలా మూడు సంస్థలు కలిసి 40 బస్సులను నడుపుతున్నాయి. దీంతో ఈ 3 సంస్థల మధ్య సమన్వయం కుదరడం లేదు. బస్సులు నడిపేందుకు అవసరమైన విద్యుత్ సదుపాయాన్ని, ఒక కిలోమీటర్‌కు రూ.33.12 చొప్పున అద్దెలను సైతం చెల్లిస్తున్న ఆర్టీసీకి వాటి నిర్వహణపైన మాత్రం పట్టు లేకుండాపోయింది. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
తరచుగా బ్రేక్...
ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లు పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ అయిన భగీరథకు చెందిన వారు. ఆర్టీసీ డ్రైవర్లతో పోల్చుకుంటే వాళ్లకు సరైన శిక్షణ ఉండకపోవచ్చు. దీంతో ఈ డ్రైవర్లలో కొందరు అదుపు తప్పి ప్రమాదాలకు పాల్పడ్డారు. ఎలాంటి నష్టం వాటిల్ల లేదు కానీ రాష్ డ్రైవింగ్ కారణంగా బస్సులను డివైడర్‌లపైకి ఎక్కించడం, ఆగి ఉన్న లారీని ఢీకొనడం, ప్రమాదకరమైన రీతిలో ఓవర్‌టేక్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఒలెక్ట్రా సంస్థ ఐదుగురు డ్రైవర్లను విధుల నుంచి తప్పించింది. ఈ క్రమంలో డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. కేవలం రూ.20 వేల జీతంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్న తమలో కొందరిని విధుల నుంచి తప్పించడం పట్ల నిరసనకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ అప్పటికప్పుడు కొన్ని చర్యలు చేపట్టింది. ఒలెక్ట్రా, భగీరథ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. తాత్కాలికంగా డ్రైవర్లు తమ ఆందోళన విరమించినప్పటికీ జీతభత్యాల పైన మాత్రం తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లస్థాయి నైపుణ్యం, అనుభవం ఈ డ్రైవర్లకు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలకు పాల్పడుతున్నారు.
శిక్షణ లేకపోతే ఎలా...
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు వేలాది మంది దేశవిదేశాలకు రాకపోకలు సాగిస్తారు. అలాంటి ప్రయాణికులకు ఎంతో మెరుగైన,నాణ్యమైన రవాణా సదుపాయాన్ని అందజేయవలసిన బాధ్యత ఆర్టీసీపైన ఉంది. కానీ బస్సులు నడిపే కీలకమైన విధి నిర్వహణను ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టి ప్రేక్షకపాత్ర వహించడం వల్ల ఆర్టీసీ ప్రతిష్టకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment