సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో నిర్వాహకులు రూట్ మార్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లో పేకాట క్లబ్బులు నిర్వహించిన వారు ఇప్పుడు మరింత అప్రమత్తతతో బెంగళూరు, ముంబై, గుంటూరును అడ్డాగా చేసుకున్నారు. రాష్ట్రంలో క్లబ్బులు నిర్వహించడం తప్పు గానీ, రాష్ట్రం బయట ఏం చేసుకున్నా తమను ఏంచేయాలేరంటూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు నిర్వాహకులు కోట్ల రూపాయల్లో జూదరుల నుంచి దండుకుంటున్నారు.
మూడు ప్రధాన కేంద్రాలు...
గుంటూరు జిల్లాల్లోని దాచేపల్లిలో, కర్నాటక సరిహద్దు రాయ్‌చూర్‌లో... బోయినిపల్లికి చెందిన ఓ క్లబ్ నిర్వాహకుడు పేకాట కేంద్రాలను నిర్వహించేవాడు. అయితే రాయ్‌చూర్ స్థానిక వ్యాపారి ఆ క్లబ్‌ను కొనుగోలు చేయడం, ఈ నెల 16న గంజాయి స్మగ్లింగ్ పేరుతో దాచేపల్లి క్లబ్‌ను పోలీసులు మూసివేయించడంతో ఈసారి దందాకు బెంగళూరును ఎంచుకున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే బెంగళూరులో రెండు క్లబ్‌లను లీజ్‌కు తీసుకొని నడిపిస్తున్నాడు. ఇది తెలిసిన బోయినిపల్లికి చెందిన క్లబ్ నిర్వాహకుడు ఆ నగరాన్ని ఎంచుకున్నాడు. బేగంబజార్‌కు చెందిన ఓ అగర్వాల్ ఏకంగా ముంబైలోని థానే పరిధిలో మూడు క్లబ్‌లు, బీదర్‌లో మరో రెండు క్లబ్‌లు ఏర్పాటుచేసి దందా సాగిస్తున్నాడు.
రాకపోకల ఖర్చు వాళ్లదే...
పేకాట కోసం వెళ్లేవారి విమాన టికెట్లు, గెస్ట్‌హౌస్, ఏసీ వెహికల్ అన్ని నిమిషాల్లో క్లబ్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి ‘సాక్షి’ తెలిపారు. ప్రతీ రోజూ ఈ ముగ్గురు వ్యక్తులు నడిపిస్తున్న క్లబ్‌లకు 350 మంది వివిధ మార్గాల ద్వారా వెళ్తున్నారని, శని, ఆదివారాలు వస్తే బెంగళూరు, బీదర్‌కు ఏసీ బస్సులు, ముంబైకి విమానాల్లో 500 మంది కస్టమర్లు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్క హైదరాబాద్ నుంచే ఇంత మంది వెళ్తున్నారని, ఇప్పుడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచీ రద్దీ పెరిగిందని వివరించారు. ఇలా నిత్యం ఈ ముగ్గురు రూ.2.5 కోట్ల వరకు దందా సాగిస్తున్నారని తెలిపారు.
లక్షల్లో గోవిందా...
పేకాట కోసం వెళ్తున్న వారి సంఖ్య పెరగడంతో వ్యాపారులే ఏసీ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. బోయినిపల్లికి చెందిన నిర్వాహకుడు ఏకంగా నాలుగు ఏసీ బస్సులు కొన్నాడు. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న కొందరు ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, అయితే డబ్బు పోగొట్టుకుంది వేరే రాష్ట్రం కావడంతో తాము ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment