అమ్మో ఏసీ బస్సా..!!
ఏసీ బస్సులను చూస్తే చాలు.. జనం భయపడిపోతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వీలైనంత వరకు ఏసీ బస్సులు కాకుండా మామూలు హైటెక్ బస్సుల్లోనే బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా వేసవి కాలం వస్తూనే రైళ్లలో ఏసీ టికెట్లకు, బస్సుల్లో వోల్వో, ఏసీ బస్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఈసారి వరుసపెట్టి ఏసీ బస్సుల్లో ప్రమాదాలు జరుగుతుండటంతో జనం భయపడుతున్నారు.
తాజాగా సోమవారం తెల్లవారుజామున మరో బస్సులో ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సులోంచి పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి వద్ద ఈ సంఘటన జరిగింది. దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే కర్ణాటక పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరుసపెట్టి జరుగుతున్న ఈ సంఘటనల వల్ల తమ ఏసీ బస్సులకు డిమాండు బాగా తగ్గిందని, వాటికంటే హైటెక్ బస్సుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటోందని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు.