క్లబ్బులు... డబ్బులు!
- ఏపీలో పేకాట క్లబ్బుల పునఃప్రారంభానికి భారీగా పైరవీలు
- పీఎంవో నుంచి పోలీసు అధికారులకు ఒత్తిళ్లు
- అధికారులు-నేతల మధ్య సాగుతున్న కోల్డ్‌వార్
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో కొన్నేళ్లుగా మూతపడి ఉన్న పేకాట క్లబ్బులపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు కన్నేశారు. వీటిని తెరిపించేందుకు భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుస్తున్నారు. క్లబ్బులు మళ్లీ తెరిపించడాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో అధికారులు-నేతల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. సదరు నేత ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రిక్రియేషన్ పేరుతో ఏర్పాటైన పలు క్లబ్బులు పేకాట కేంద్రాలుగా మారిపోవడంతో గతంలో చాలామంది రోడ్డున పడ్డారు. దీంతో వీటిని మూయించాలనే నిరసన ఉద్యమాలు నడిచాయి. ఆ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట పేకాట క్లబ్బులపై పోలీసులు నిషేధం విధించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమకు చెందిన జిల్లా పరిషత్ స్థాయి నేత కన్ను వీటిపై పడింది. తనకు ప్రధాన అనుచరుడు, ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో నేతతో కలసి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూతపడిన పేకాట క్లబ్బుల జాబితాను ఆ అనుచరుడు సేకరించి జిల్లా పరిషత్ స్థాయి నేతకు అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి అండతో క్లబ్బుల్ని తెరిపించేందుకు సదరు నేత పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. క్లబ్బుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న ఆ నేత, లోకల్ నుంచి హైదరాబాద్ వరకూ భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెపుతున్నారని సమాచారం.
యువనేత వద్ద పంచాయితీ..
ఇక సీఎంవో అధికారి.. పై స్థాయి పోలీసు అధికారుల నుంచి జిల్లాల ఎస్పీల వరకూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. రెండు నెలల క్రితం రాజధాని ప్రకటిత జిల్లాలో రెండు క్లబ్బులు పునఃప్రారంభమయ్యాయి. ఇది తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు వాటిని మూయించాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఒకదాన్ని మూయించిన అధికారులు మరోదానిపై నిఘా పెట్టారు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ క్లబ్బులు పునఃప్రారంభానికి ఒత్తిళ్లు వస్తున్నాయని జిల్లా అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పేకాట క్లబ్బులకు అనుమతి ఇవ్వద్దంటూ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలిసిన ‘జిల్లా పరిషత్ నేత, క్లబ్బుల పంచాయితీని ప్రభుత్వంలో అనధికారిక నెంబర్ 2 యువనేత వద్ద పెట్టారు. ఆయన ప్రయత్నించినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ససేమిరా అంటుండటంతో కోల్డ్‌వార్ మొదలైంది. తీవ్రస్థాయి రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో స్థానిక అధికారులు కొన్ని క్లబ్బుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది.