
ఏసీ బస్సులో మంటలు, ఆరుగురు సజీవ దహనం
మహబూబ్నగర్ పాలెం వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
బెంగళూరు : మహబూబ్నగర్ పాలెం వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దావణగెరె నుంచి బెంగళూరు వెళుతున్న ఎస్పీఆర్ ప్రయివేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో చిత్రదుర్గ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.