Davangere
-
కుర్కురే తెచ్చిన రగడ.. 30 మంది అరెస్ట్
బనశంకరి: ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు. -
బాల్య వివాహం.. సినిమా స్టైల్లో విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కిడ్నాప్‌నకు గురైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బళ్లారి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. విద్యార్థిని తల్లితో పాటు మరో ఇద్దరు యువకులు సినిమా తరహాలో కళాశాల ఆవరణలో నుంచి కారులో కిడ్నాప్ చేస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అడ్డగించి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారి జిల్లాకు చెందిన ఓ యువతికి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు అప్పట్లో బాల్యవివాహం చేశారు. ఈనేపథ్యంలో కిడ్నాప్‌నకు గురైన ఆమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించేందుకు విశ్వవిద్యాలయంలో చేరింది. తనకు బాల్య వివాహం చేసినప్పడు అతని గురించి తెలియదని, తనను పెళ్లి చేసుకొన్న సదరు వ్యక్తికి మంచి నడత లేకపోవడం వల్ల అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
దావణగెరెకు టీఎస్ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్ కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ , ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''మధ్య కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిమాండ్ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ఏర్పాటు చేశాం. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి." అని సూచించారు. ప్రస్తుతం కర్నాటకలోని బెంగళూరు, రాయచూర్, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతుండటం శుభసూచికమన్నారు. దావణగెరె సర్వీస్ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని, టికెట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రయాణికులకు సూచించారు. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ సర్వీస్ ప్రారంభోత్సవంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, సీటీఎం (ఎం అండ్ సీ) విజయ్ కుమార్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, డీవీఎం రాజు, మియాపూర్-1 డీఎం రామయ్య, సీఐ సుధ, డ్రైవర్లు రవీందర్, కర్ణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం ఏడు బృందాలు
బెంగళూరు: కన్నడనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడుపుల వ్యవహారం.. అధికార బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్ ఈ కేసులో అరెస్ట్ కాగా, ఈ స్కాంకు సంబంధించి ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ సూపరిడెంట్స్ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ముడుపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న చన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విరూపాక్షప్ప కోసం ఆయా బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా బెంగళూరు, దావణగెరెలో గాలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కు లోకాయుక్త అధికారులు సీఆర్పీసి– 41 ఏ కింద నోటీస్ జారీచేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు, దావణగెరెలోని విరూపాక్షప్ప నివాసాలతో పాటు అధికారిక నివాసం, చన్నగిరిలోని కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించారు. విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్.. సబ్బులు, డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల డీల్‌ను క్లియర్ చేయడానికి రూ. 40 లక్షల లంచం రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, ఆ మరుసటిరోజు జరిగిన సోదాల్లో ఇంట్లో రూ. 6 కోట్లకు మించిన నగదు లభ్యం కావడం, అలాగే ప్రైవేట్ కార్యాయలంలో మరో రూ. 2 కోట్లు లభించడం.. మొత్తంగా ముడుపుల వ్యవహారం బయటపడింది. ఆ వెంటనే కేఎస్డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విరూపాక్షప్ప.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముడుపుల స్కాంలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పనే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్న అధికారులు.. ఆయన కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు తనయుడు ప్రశాంత్‌ను, మరో నలుగురు జ్యూడిషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం అధికార బీజేపీని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. కాంగ్రెస్ ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పార్టీనే(బీజేపీ) ఈ వ్యవహారం చూసుకుంటుందని చెబుతోంది. -
కర్ణాటకలో ఒక్క ఛాన్సివ్వండి: కేజ్రీవాల్
దావణగెరె: అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటక ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలలు, మంచి ఆరోగ్య వసతులు ప్రజలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మార్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. శనివారం దావణగెరెలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని, పంజాబ్‌లోని తమ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించిందని చెప్పారు. రాష్ట్రంలో 40% కమీషన్ ప్రభుత్వం పనిచేస్తోందంటూ బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారమిస్తే అవినీతి లేకుండా చేస్తామంటున్న హోం మంత్రి అమిత్ షా.. తన నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. లోకాయుక్త అధికారులు రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎమ్మెల్యేను, అతడి కుమారుడిని అరెస్ట్ చేయలేదు. కానీ, ఢిల్లీలో మా నేత సిసోడియాను అరెస్ట్ చేశారు’అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారుతో అవినీతి కూడా రెట్టింపయ్యిందని ఎద్దేవా చేశారు. -
ఆ గ్రీన్జోన్లో 21 మందికి కరోనా పాజిటివ్!
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 614కు చేరుకుంది. ఇక వారం రోజుల క్రితం గ్రీన్ జోన్‌గా ప్రకటించబడిన దావణగెరెలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి వైరస్ సోకడంతో కలకలం రేగింది. ఈ విషయం గురించి జిల్లా డిప్యూటీ కమిషనర్ మహంతేశ్ బెలాగి మాట్లాడుతూ.. మే 1, 2 తేదీల్లో కరోనా లక్షణాలు ఉన్న 72 మంది శాంపిళ్లు.. ఆదివారం రోజు 164 మంది శాంపిళ్లు పరీక్షకు పంపగా.. వారిలో 21 మంది కరోనా బారిన పడినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో పర్యవేక్షణాధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారని.. వారికి కరోనా ఎవరి ద్వారా సోకిందనే విషయంపై విచారణ చేస్తున్నారని వెల్లడించారు. (నేటి నుంచి లాక్డౌన్ 3.0) కాగా దావణగెరె జిల్లాలో అంతకుముందు 10 కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో ఇద్దరు కోలుకున్నారు. ఒకరు మరణించారు. కొన్ని రోజులుగా యాక్టివ్ కేసులు లేకపోవడంతో దావణగెరెను గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చి.. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం నాటికి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 614 మంది కరోనా బాధితుల్లో 287 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా... మొత్తంగా 25 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇక దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటకలో సంభవించిన విషయం తెలిసిందే.(ధారావిలో ఒక్కరోజే 94 కరోనా కేసులు) -
మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా
కట్టుబాట్లు విధించుకున్న హరపనహళ్లి, అలగిలవాడ గ్రామస్తులు హరపనహళ్లి (దావణగెరె) : ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా మద్యం అక్రమార్కులకు కొన్ని గ్రామాల్లో రూ.లక్ష జరిమానా విధిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...దావణగెరె జిల్లా, చిరస్థహళ్లి గ్రామ పంచాయతీలోని హరపనహళ్లి, అలగిలవాడ గ్రామాల్లోని ప్రజలు మద్యం విక్రయాలపై స్వచ్ఛందంగా నిషేధం విధించుకున్నారు. ఆయా గ్రామల్లో ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష దండన విధిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా తమ హెచ్చరికలను ఖాతరు చేసి మద్యం విక్రయించిన వారి గురించి సమాచారమిచ్చిన వారికి రూ.25,000 బహుమతి ప్రకటించడం మరో విశేషం. మద్యం అమ్మకాల వల్ల తమ గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని, వయసు తేడా లే కుండా పిల్లలు, పెద్దలు మద్యానికి బానిసలయ్యారని, అందుకే మద్యం అమ్ముతున్న దుకాణాలను మూసివేయించి ఇకపై మద్యం అమ్మిన వారికి రూ.లక్ష దండన విధించేలా నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. -
ఏసీ బస్సులో మంటలు, ఆరుగురు సజీవ దహనం
-
ఏసీ బస్సులో మంటలు, ఆరుగురు సజీవ దహనం
బెంగళూరు : మహబూబ్‌నగర్ పాలెం వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దావణగెరె నుంచి బెంగళూరు వెళుతున్న ఎస్పీఆర్ ప్రయివేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో చిత్రదుర్గ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.