బెంగళూరు: కన్నడనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడుపుల వ్యవహారం.. అధికార బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్‌విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్ ఈ కేసులో అరెస్ట్ కాగా, ఈ స్కాంకు సంబంధించి ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ సూపరిడెంట్స్ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ముడుపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న చన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విరూపాక్షప్ప కోసం ఆయా బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా బెంగళూరు, దావణగెరెలో గాలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో..
పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కు లోకాయుక్త అధికారులు సీఆర్‌పీసి– 41 ఏ కింద నోటీస్ జారీచేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు, దావణగెరెలోని విరూపాక్షప్ప నివాసాలతో పాటు అధికారిక నివాసం, చన్నగిరిలోని కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్‌డీఎల్) కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించారు.
విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్.. సబ్బులు, డిటర్జెంట్‌ల తయారీకి అవసరమైన ముడి సరుకుల డీల్‌ను క్లియర్ చేయడానికి రూ. 40 లక్షల లంచం రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, ఆ మరుసటిరోజు జరిగిన సోదాల్లో ఇంట్లో రూ. 6 కోట్లకు మించిన నగదు లభ్యం కావడం, అలాగే ప్రైవేట్ కార్యాయలంలో మరో రూ. 2 కోట్లు లభించడం.. మొత్తంగా ముడుపుల వ్యవహారం బయటపడింది. ఆ వెంటనే కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విరూపాక్షప్ప.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముడుపుల స్కాంలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పనే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్న అధికారులు.. ఆయన కోసం గాలింపు చేపట్టారు.
మరోవైపు తనయుడు ప్రశాంత్‌ను, మరో నలుగురు జ్యూడిషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం అధికార బీజేపీని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. కాంగ్రెస్ ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పార్టీనే(బీజేపీ) ఈ వ్యవహారం చూసుకుంటుందని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment