
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కిడ్నాప్‌నకు గురైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బళ్లారి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. విద్యార్థిని తల్లితో పాటు మరో ఇద్దరు యువకులు సినిమా తరహాలో కళాశాల ఆవరణలో నుంచి కారులో కిడ్నాప్ చేస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అడ్డగించి రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. బళ్లారి జిల్లాకు చెందిన ఓ యువతికి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు అప్పట్లో బాల్యవివాహం చేశారు. ఈనేపథ్యంలో కిడ్నాప్‌నకు గురైన ఆమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించేందుకు విశ్వవిద్యాలయంలో చేరింది. తనకు బాల్య వివాహం చేసినప్పడు అతని గురించి తెలియదని, తనను పెళ్లి చేసుకొన్న సదరు వ్యక్తికి మంచి నడత లేకపోవడం వల్ల అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది.
ఈనేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.