ఏసీ బస్సు.. గిరాకీ తుస్సు!
►ఏసీ బస్సులకు ఆదరణ అంతంతే..
►సగటు ఆక్యూపెన్సీ 38–40 మాత్రమే
►నష్టాల్లో నడుస్తున్న పుష్పక్
►మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులదీ అదే పరిస్థితి
సిటీబ్యూరో: ఎండలు మండుతున్నా ఏసీ బస్సులు మాత్రం ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఏసీ బస్సులు, ఎయిర్‌పోర్టుకు తిరిగే పుష్పక్ బస్సుల్లో సైతం ఆక్యూపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. సాధారణంగా వేసవిలో ప్రయాణికులు మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల నుంచి ఏసీ బస్సుల వైపు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆదరణ కనిపించడం లేదు. అన్ని బస్సుల్లోనూ సగటు ఆక్యూపెన్సీ శాతం 38–40 వరకే నమోదవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు సైతం అదే బాటలో నడుస్తున్నాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచీ వరుస నష్టాలే చవిచూస్తున్నాయి. మరోవైపు వేసవి అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రద్దీ, అభిరుచి మేరకు బస్సుల నిర్వహణలో తగిన మార్పులు చేర్పులు చేయకపోవడం లాంటి అంశాలు నిరాదరణకు కారణమవుతున్నాయి.
ప్రారంభం నుంచీ నష్టాలే..
అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులపై మొదటి నుంచి నష్టాలే వస్తున్నాయి. వీటి నిర్వహణకు కిలోమీటర్‌కు రూ.68 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ.44.62 – రూ. రూ.52 మధ్య మాత్రమే ఉంది. గతంలో దారుణమైన నష్టాలను చవిచూసిన ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్వకుండానే ప్రవేశపెట్టిన 36 పుష్పక్ బస్సులు ఆర్టీసీ పాలిట గుదిబండగా మారాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ బస్సులు కూడా పెద్దగా ఆదరణ పొందడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని సదుపాయాలతో రూపొందించిన ఈ బస్సులు సాఫ్ట్‌వేర్ వర్గాలను సైతం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ బస్సులను నడపాలంటే కిలోమీటర్‌కు కనీసం రూ.64 లభించాలి. కానీ ప్రస్తుతం వీటిపైనా రూ.43 కంటే ఎక్కువ రావడం లేదు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ – పటాన్‌చెరు, ఈసీఐఎల్ – వేవ్‌రాక్, ఉప్పల్ – వేవ్‌రాక్, కోఠి – పటాన్‌చెరు తదితర మార్గాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి.
ప్రణాళిక లోపం...
నగరంలో ఏసీ బస్సులకు ఆదరణ లభించకపోవడంతో కొన్నింటిని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి యాదాద్రి వరకు నడుపుతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఈ మార్గంలోనూ ప్రయాణికులు ఎక్కువగా జిల్లా బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఏసీ బస్సుల్లో చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం వల్లే ప్రయాణికులు వాటిలో ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనిష్టంగా రూ.15 నుంచి గరిష్టంగా రూ.120 వరకు చార్జీలున్నాయి. ఇవి ఆర్డినరీ, మెట్రో బస్సుల చార్జీలతో పోల్చుకుంటే రెట్టింపు కన్నా ఎక్కువ. కొన్ని సాఫ్ట్‌వేర్ జోన్‌లలో తప్ప సాధారణ ప్రయాణికులు మాత్రం పెద్దగా వీటి జోలికి వెళ్లడం లేదు. మరోవైపు వేసవి రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందించుకొని బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రణాళిక లోపంతోనే ఏళ్లు గడిచినా ఈ బస్సులు నష్టాల్లో నడుస్తున్నాయి.