‘విద్యుత్’ పోరాట అమరులకు నివాళులు
కాకినాడ సిటీ : విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ప్రపంచ బ్యాంకు షరుతులు తగవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 2000 ఆగస్టు 28న జరిగిన వామపక్షాల పోరాటంలో అమరులకు ఆదివారం సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు అధ్యక్షత వహించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సీహెచ్ అజయ్‌కుమార్.. అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి జోహార్లర్పించారు. 16 ఏళ్ల క్రితం టీడీపీ అధికారంలో ఉండగా, ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంటే వామపక్షాలు ఎదురుతిరిగాయని నేతలు గుర్తుచేశారు. నిరంకుశంగా ఉద్యమాలను అణచాలని అంగన్‌వాడీలపై, ఆర్టీసీ ఉద్యమంపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారని దుయ్యబట్టారు. మరలా అధికారంలోకి వచ్చి ప్రజలపై భారాలు వేస్తున్నారని, ప్రజల ప్రయోజనాలకన్నా.. కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడతామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.వీరబాబు, ఎంవీ రమణ, ఎం.రాజ్‌గోపాల్, సూర్యనారాయణ, మహిళా నాయకులు రమాదేవి, సుభాషిణి, విద్యార్థి నాయకులు రాజ్, దుర్గాప్రసాద్, స్పందన, సూర్య, శివ పాల్గొన్నారు.