తెరుచుకున్న క్లబ్‌లు | clubs are re opened | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న క్లబ్‌లు

Published Wed, Aug 14 2013 4:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

clubs are re opened


 సాక్షి ప్రతినిధి, వరంగల్: అర్బన్ ఎస్పీ హెచ్చరికలతో అయిదు నెలల కిందట మూతపడిన క్లబ్‌లు మళ్లీ తెరుచుకున్నయ్. రెండు రోజుల నుంచి క్లబ్‌లలో ఆట మొదలు కావడం వెనుక అసలు మర్మమేమిటీ...? మొన్నటి వరకు బంద్ అంటే బంద్... అని క్లబ్ నిర్వాహకులను హడలెత్తించిన పోలీసు అధికారులు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారు...? అనే సందేహాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా ఈ వ్యవహారం పోలీసు విభాగాన్ని కుదిపేస్తోంది. జిల్లా అధికారులు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ... ఇదే రేంజ్‌కు చెందిన పోలీస్ బాస్ వీటికి అనుమతిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతోనే ఆయన తలూపినట్టు తెలుస్తోంది. దీంతో మొన్నటి వరకు క్లబ్బులంటేనే కన్నెర్ర జేసిన జిల్లా పోలీసు యంత్రాంగం బిత్తరపోయింది. తాము చేసేదేమీ లేదన్నట్లుగా చేతులు ముడుచుకుంది.
 
  ఈ క్లబ్బుల రీ ఓపెన్ వెనుక స్వయానా ఓ మంత్రి పేరు  వినిపిస్తోంది. నగరంలో పేకాట నిర్వహిస్తున్న క్లబ్‌లన్నింటికీ తెరచాటు నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం. అందుకే వారి వ్యాపారాలకు అండదండగా నిలవడంతో పాటు క్లబ్‌లు తెరిపించేందుకు మంత్రి తనవంతుగా పైరవీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాబోయే మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా రాజకీయ ఎత్తుగడగా ఈ క్లబ్‌లను తెరిపించినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్వాహకుల ఒత్తిళ్లతో పాటు వ్యాపార లావాదేవీల్లో వాటాలుండడం అందుకు దారితీసినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో నాలుగు బడా క్లబ్‌లున్నాయి. వీటిలో మూడు క్లబ్బులు తెరుచుకున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు హంటర్ రోడ్డులో ఉన్న  క్లబ్‌లు స్వయానా అధికార పార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ దగ్గరలో మరో క్లబ్ నడుస్తోంది.
 
  రిక్రియేషన్ పేరుతో వీటన్నింటిలోనూ పేకాట జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ  వ్యసనానికి అలవాటు పడిన జూదగాళ్లు ఇల్లు గుల్ల చేసుకున్న సంఘటనలు నగరంలో కోకొల్లలు. ఏకంగా క్లబ్‌లు మూసేయించాలని, తమ సంసారాలు కాపాడాలని పోలీసులకు మహిళలు లేఖలు రాస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారు తీరిక వేళల్లో ఆడుకునే బ్రిడ్జి ఆటకు గతంలో రెండు క్లబ్బులకు అనుమతులున్నాయి. అదే సాకుతో ఈ క్లబ్బులు చాటు మాటుగా రెమ్మీతో(పదమూడు ముక్కలాట) పాటు మూడు ముక్కలాట నిర్వహిస్తున్నారుు. వాస్తవంగా రిక్రియేషన్ క్లబ్‌ల్లో మద్యం నిషేధం. పేకాటకు అనుమతి ఉన్న వాటిలో మరింత కఠిన నిబంధనలుంటాయి. ఓ ప్రత్యేకాధికారి పర్యవేక్షణ... సీసీ కెమెరాల నిఘాలో రెమ్మీ ఆడాలి. కానీ  జూదం.. నేరంగా భావించే మూడు ముక్కలాట ఆడుతున్నారు. క్లబ్‌లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా టేబుళ్లపైనే మద్యం సేవిస్తున్నారు.
 
  పక్కనే ఉన్న బార్‌ల నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. నగరంలోని ఒక్కో క్లబ్‌లో పేకాటపైనే ప్రతీ రోజూ *10 లక్షల నుంచి *18 లక్షల వ్యాపారం సాగుతోందని తెలుస్తోంది.  మద్యం, భోజన ఖర్చులు... ఇవన్నీ అదనమే. క్యాష్‌ను కౌంటర్లో చెల్లించి టోకెన్లు తీసుకున్న వారినే క్లబ్బులో ఆడేందుకు అనుమతిస్తారు. టేబుళ్లను బట్టీ *500, * 1000 నుంచి *4000 వరకు టోకెన్లు చెల్లించి ఆడేందుకు పోటీ పడుతుండటం కనిపిస్తోంది. రోజుకు కనీసం రెండు వేల టోకెన్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్కో టోకెన్‌పై 10 శాతం కమీషన్, వాటర్ బాటిళ్లు, మద్యం, భోజనాల బిల్లులు క్లబ్బు నిర్వాహకులకు ఆదాయం తెచ్చిపెడుతాయి. అడ్డగోలుగా సంపాదించేందుకు ఇదో ఆదాయ మార్గం కావటంతో రాజకీయ నాయకుల అండదండలకు, పోలీసు పైరవీలకు నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement