ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
- నెలాఖరుకు గ్రేటర్‌లోని 115 బస్సుల్లో అందుబాటులోకి
- అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్
- రెండు విడతలుగా గంట పాటు ఉచిత ఇంటర్నెట్
- రెండు రూట్లలో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన ఏసీ బస్సుల్లో పయనిస్తున్నారా.. అయితే ఇకపై మీరు వైఫై ద్వారా ఉచితంగా ఇంటర్నెట్‌ను పొందవచ్చు. గంట పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఆర్టీసీ మీకు కల్పించనుంది. అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌తో కావలసిన డాటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో మాత్రమే ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించిన ఆర్టీసీ.. నగరంలో తిరుగుతున్న 115 ఏసీ బస్సులకు సైతం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, ఈసీఐఎల్ నుంచి వేవ్‌రాక్ వరకు నడిచే రెండు ఏసీ బస్సుల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏసీ బస్సులన్నింటికీ ఈ నెలాఖరు నాటికి ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. స్మార్ట్‌ఫోన్లు వినియోగించే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణించే సమయంలో అరగంట చొప్పున రెండు విడతలుగా 4జీ నెట్‌వర్క్ సామర్థ్యం ఉన్న ఎయిర్‌టెల్ ఇంటర్‌నెట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సుల్లో వైఫై రూటర్లను అమర్చనున్నారు. ప్రయాణికులు బస్సులోకి ప్రవేశించిన వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సిగ్నల్స్‌ను అందుకుంటారు. వైఫై సేవలను వినియోగించుకునేందుకు సిద్ధపడిన వారికి పాస్‌వర్డ్ డిస్‌ప్లే అవుతుంది. మొదటి అరగంట ఉచితంగా నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలు ఆగిపోతాయి. మరో అరగంట కావాలనుకుంటే మరోసారి వైఫై నెట్‌వర్క్ ఓపెన్ చేయాలి లేదా తిరుగు ప్రయాణంలో మిగతా అరగంట వినియోగించుకోవచ్చు.
ఐటీ వర్గాలకు ప్రయోజనం..
నగరంలోని ఉప్పల్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, కోఠి, పటాన్‌చెరు, లింగంపల్లి, ఈసీఐఎల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్లకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్, జేఎన్‌టీయూ, పర్యాటక భవన్‌ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోని 115 ఏసీ బస్సులకు ఈ ఉచిత వైఫైను అమలు చేస్తారు. దీనివల్ల నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ఐటీ నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.