లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. పశ్చిమ రైల్వే మార్గంలో జూన్ నెల నుంచి ఏసీ లోకల్ రైలును ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సాక్షి, ముంబై: లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. పశ్చిమ రైల్వే మార్గంలో జూన్ నెల నుంచి ఏసీ లోకల్ రైలును ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రైలును చర్చిగేట్-బోరివలి మధ్య నడపాలని తొలుత నిర్ణయించారు. అయితే ఏ సమయంలో నడపాలి? చార్జీ ఎంత వసూలు చేయాలి? తదితర అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. చర్చిగేట్ నుంచి బోరివలి వరకు చార్జీ కింద రూ.400 వసూలు చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ మొత్తం కేవలం శ్రీమంతులుు, బడా ఉద్యోగులు మాత్రమే భరించగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమైంది, అంతేకాకుండా ఈ రైలుకు సీజన్ పాసులను జారీ చేయడం లేదు.
టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. చర్చిగేట్-బోరివలి స్టేషన్ల మధ్య దూరం 33 కిలోమీటర్లు. సాధారణంగా లోకల్ రైళ్లలో మొదటి తరగతి టికెట్‌కు రూ.120 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీనినిబట్టి ఏసీ లోకల్ రైలుకు రూ.196 చార్జీలు కేటాయించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే ఏసీ రైలుకు నెల, త్రైమాసిక పాసులు లేకపోవడంతో వారం లేదా పక్షం రోజుల పాసులను జారీచేయాలనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ప్రయాణికులు ఏసీ రైలు టికెట్ల కోసం స్టేషన్లలో విండోల వద్ద క్యూలో నిలబడకుండా ‘ఈ-టికెట్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. కాగా ఏసీ లోకల్ రైలు చార్జీలు పేదలకు ముచ్చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి. దీని కంటే నిత్యం ప్రయాణించే లోకల్ రైళ్లే నయమని సామాన్యులు భావిస్తున్నారు.