సాక్షి, సిటీబ్యూరో : సిటీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా...దోమలు ఉండవచ్చు తస్మాత్ జాగ్రత్త. సాధారణ దోమల సంగతి సరే సరి. పగటిపూట డెంగీ వంటి ప్రమాదకరమైన దోమలు కుట్టే అవకాశం లేకపోలేదు. రెండు రోజుల క్రితం ఎల్‌బీనగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే (222 ఎల్) ఏసీ బస్సులో కొందరు ప్రయాణికులు ఇదే భయాందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ దోమల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తుందంటూ సిబ్బందితో ఘర్షణకు దిగారు. పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బస్సులో ఎలాంటి ఫిర్యాదు బాక్సు లేకపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. ఒక్క ఎల్‌బీనగర్–లింగంపల్లి రూట్‌లోనే కాదు. ఏసీ బస్సులు రాకపోకలు సాగించే అన్ని రూట్లలో దోమల బెడద తీవ్రమైందంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల, రోడ్లపైన ఉండే కాలుష్యకారకాల వల్ల బస్సుల్లోకి దోమలు చేరుకుంటున్నాయి. ప్రతి రోజు బస్సులను శుభ్రం చేయకపోవడం కూడా మరో కారణం. దీంతో ప్రయాణికులను దోమలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు మెట్రో రాకతో ఏసీ బస్సులకు ఆదరణ తగ్గుముఖం పట్టగా దోమల స్వైరవిహారం అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మెట్రో రైలు కంటే కూడా ఎక్కువ చార్జీలు చెల్లించి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసినప్పటికీ సరైన సదుపాయాలు ఉండడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా బస్సుల నిర్వహణ పైన ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు చాలా బస్సుల్లో ఏసీ సరఫరా కూడా సరిగ్గా ఉండడం లేదు.
శుభ్రం చేయడం లేదు
నగరంలోని మూడు ప్రధాన రూట్లలో 120 ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం, కొండాపూర్, హైటెక్‌సిటీ వైపు కొన్ని బస్సులు, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి లింగంపల్లి, హైటెక్‌సిటీ, బీహెచ్‌ఈఎల్, తదితర ప్రాంతాలకు మరి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తుండగా సికింద్రాబాద్, బేగంపేట్, జేఎన్‌టీయూ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి కొన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులు మినహా మిగతా బస్సుల నిర్వహణ అస్తవ్యవస్థంగా ఉంది. ఎప్పటికప్పుడు బస్సులను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త,చెదారం పేరుకుంటోంది. సీట్ల అడుగున ఏ మాత్రం శుభ్రం చేయడం లేదని, దీంతో దోమలు తిష్ట వేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఎయిర్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో బస్సులోని అన్ని మూలల్లోనూ ప్రతి రోజు శుభ్రం చేయాల్సి ఉండగా ఆ పని సక్రమంగా జరగడం లేదు. మరోవైపు నెలకోసారి కెమికల్ వాషింగ్ చేస్తారు. కానీ కొన్ని డిపోల్లో 2 నెలలు దాటినా కెమికల్ క్లీనింగ్ చేయకపోవడం గమనార్హం. ఆర్టీసీలో బస్సుల శుభ్రతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఈ పనులను నిర్వహించే కాంట్రాక్టర్‌లు తక్కువ సిబ్బందితో బస్సులను నిర్వహిస్తున్నారు. దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందనే విమర్శలు ఉన్నాయి.
డెంగీ రావచ్చు...
‘‘ ఏసీ బస్సుల్లో విండోస్ మూసి ఉంటాయి. కానీ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కానీ దోమలు అదే పనిగా కాళ్లకు కుట్టేస్తాయి. పగటి పూట డెంగ్యూ దోమలు తిరుగుతాయి కదా.అందుకే భయంగా ఉంది.’’ అంటూ ఎల్‌బీనగర్ నుంచి బంజారాహిల్స్‌కు బయలుదేరిన ఒక ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎన్ని డబ్బులైనా ఫరవాలేదులే ప్రశాంతంగా వెళ్లొచ్చుననుకుంటే ఈ దోమల బెడద ఇబ్బందిగా ఉంది’. అంటూ వెంకటేశ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ ఎల్‌బీనగర్ నుంచి జీవీకే వరకు రూ.60 చార్జీ తీసుకుంటారు. కానీ ఏసీ సరిగ్గా రాదు. ఎక్కడ చూసినా చెత్త, దోమలు కనిపిస్తాయి. కండక్టర్,డ్రైవర్‌లు తమకు సంబంధం లేదంటారు. ఇలాగైతే ఎలా...’’ లక్ష్మణ్ అనే ప్రయాణికుడి ప్రశ్న ఇది. ఇలా ఉండగా, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, డిపో నుంచి బయటకు వచ్చిన తరువాత రోడ్లపైన ఉండే దోమలు బస్సుల్లోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి శ్రీధర్ ‘సాక్షి’తో చెప్పారు. త్వరలోనే అన్ని బస్సుల్లో ఆల్ అవుట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఫిర్యాదుల బాక్సు లేదు
దోమల బెడదపైన ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నాను. కానీ బస్సులో బాక్సు లేదు. కండక్టర్ ఒక అధికారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాను. కానీ అతడు ఫోన్ ఎత్తడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. – జానయ్య, ఎల్‌బీనగర్
చాలా నిర్లక్ష్యం
ఇది కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. పేరుకే ఏసీ బస్సులు. కానీ ఏ మాత్రం శుభ్రంగా ఉండడం లేదు. ఆ బస్సుల్లో వెళ్లడం కంటే ఆర్డినరీ బస్సులు నయమనిపిస్తుంది. – వెంకన్న గౌడ్. దిల్‌సుఖ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment