ఏసీ బస్సుల్లో వైఫై..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని 5 మార్గాల్లో తిరిగే 115 ఏసీ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ఈ సౌకర్యం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గో గ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుందన్నారు. దిల్‌సుఖ్‌నగర్–లింగంపల్లి, కుషాయిగూడ–వేవ్‌రాక్, ఉప్పల్–వేవ్‌రాక్, ఎల్‌బీనగర్–పటాన్‌చెరు, ఉప్పల్–లింగంపల్లి మార్గాల్లో నడిచే ఏసీ బస్సుల్లో వైఫై అమల్లోకి రానుందన్నారు.
ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రయాణికులు తమ ఇంట్లో వైఫై సదుపాయం ఉంటే ఆ పాస్‌వర్డ్‌పై బస్సుల్లో ఎంతసేపైనా ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు ఉందని వివరిచారు.
కొత్త రూట్లకు బస్సుల విస్తరణ
సిటీ బస్సులను కొత్త రూట్లలో విస్తరించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమంలోప్రయాణికుల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా రిసాలాబజార్–గచ్చిబౌలి (5ఆర్‌జీ) రూట్‌లో నాలుగు మెట్రో డీలక్స్ బస్సులను నడుపుతారు.
వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి కేపీహెచ్‌బీ (186 రూట్) వరకు మరో 8 బస్సులు తిరుగుతాయి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి గచ్చిబౌలి (6ఎల్‌జీ) రూట్‌ను కొత్తగా పరిచయం చేయనున్నారు. ఈ రూట్‌లో కొన్ని లాలాపేట్ మీదుగా, మరికొన్ని నాచారం మీదుగా గచ్చిబౌలికి రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా మరో 21 సిటీ ఆర్డినరీ బస్సులను పలు మార్గాల్లో నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.