75 ఏసీ బస్సుల్లో వైఫై
సాక్షి , హైదరాబాద్: సిటీ ఏసీ బస్సుల్లో 4జీ ఎరుుర్‌టెల్ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలంగా ప్రయోగాలకే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు 75 బస్సుల్లో ఏర్పాటు చేశారు. బుధవారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు లాంఛనంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, డిమాండ్‌కు అనుగుణంగా దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం వైఫై సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సోమారపు తెలిపారు.
మొదటి దశలో 75 సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రారంభించగా, రెండో దశలో 115 ఏసీ బస్సులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టానికి గురైందన్నారు. మొదట రోజుకు రూ.కోటి చొప్పున నష్టం వచ్చిందని, ఆ తరువాత క్రమంగా పరిస్థితి కొంత మేరకు మెరుగుపడిందని చెప్పారు. గో రూరల్ ఇండియా సంస్థ సహకారంతో ఫోర్ జీ వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం, ఆర్‌ఎం కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ రూట్లలో వైఫై...
► ఎల్‌బీనగర్ - లింగంపల్లి (222ఎల్) రూట్‌లో 20 బస్సులు
► దిల్‌సుఖ్‌నగర్-లింగంపల్లి (218డి) రూట్‌లో 23 బస్సులు
► ఉప్పల్-లింగంపల్లి (113 కె/ఎల్) 10 బస్సులు
► ఉప్పల్-వేవ్‌రాక్ (113 ఎం/డబ్ల్యూ) 8 బస్సులు
► ఈసీఐఎల్-వేవ్‌రాక్ (17హెచ్) 14 బస్సులు
వినియోగం ఇలా...
► బస్సులోకి ప్రవేశించగానే వైఫై సిగ్నళ్లు అందుతారుు. వినియోగదారులు వైఫై సేవలను పొందేందుకు మొబైల్‌లో ఎంపిక చేసుకున్న వెంటనే ఒక పాస్‌వర్డ్ వస్తుంది.
► ఈ పాస్‌వర్డ్ ఆధారంగా ఎరుుర్‌టెల్ ఫోర్ జీ వైఫై సేవలను పొందవచ్చు.
► మొదటి 20 నిమిషాలు ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ సమయంలో తమకు కావలసిన డాటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
► ఆ తరువాత ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా రూ.25 చెల్లించి 100 ఎంబీ డాటా పొందవచ్చు. దీనిని 24 గంటల పాటు వినియోగించుకొనే సదుపాయం ఉంటుంది.