ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..! | RTC driver the guide | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..!

Published Thu, Sep 8 2016 4:03 AM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM

ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..! - Sakshi

ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..!

- కొత్త ఏసీ మినీ బస్సుల్లో టీఎస్‌ఆర్టీసీ వినూత్న ప్రయోగం
- బస్సు వెళ్లే ప్రాంతాల ప్రత్యేకతలను స్పీకర్ ద్వారా వివరించనున్న డ్రైవర్లు
- హైదరాబాద్-వరంగల్ -నిజామాబాద్ మధ్య మినీ బస్సుల సంచారం
- విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించి శిక్షణ ఇస్తున్న ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్:   ‘ఇది హుస్సేన్‌సాగర్.. భాగ్యనగర నిర్మాణంతోనే రూపుదిద్దుకున్న ఈ చెరువు నగరానికి తొలి మంచినీటి వనరు.. ఆ తర్వాత సాగునీటికీ వినియోగించారు.. ప్రస్తుతం ఇలా ఉంది..’ ‘ఇది ఏకశిలా నగరం.. ఇప్పుడు మనం వరంగల్ అంటున్నాం. కాకతీయుల పరాక్రమానికి నిలువుటద్దమిది. తెలంగాణలో రాజధాని తర్వాత పెద్ద నగరం’ 

 ఇవన్నీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు స్పీకర్ల ద్వారా వినిపిస్తున్న విశేషాలు. ఆయా ప్రాం తాల చారిత్రక, ప్రస్తుత అంశాల సమాహారం. ఇది రికార్డు చేసింది కాదు, బస్సు నడుపుతున్న డ్రైవర్ స్వయంగా స్పీకర్‌లో అప్పటికప్పుడు చెప్పే మాటలవి. బస్సు ఏయే ప్రాంతాల మీదుగా సాగుతుందో, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను ఇలా వినిపిస్తుంటాడు. అంటే.. ఇదేదో టూరిస్టు బస్సు ప్రత్యేకత అనుకోకండి. తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న వినూత్న ప్రయోగం.

 ప్రయోగాత్మక పరిశీలన..
తెలంగాణ ఆర్టీసీ కొత్తగా మినీ బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ఇందులో ప్రయోగాత్మకంగా వంద ఏసీ బస్సులు నడపబోతోంది. ఇవి హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మధ్య నడుస్తాయి. ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అప్పటికప్పుడు కూడా వీటిల్లో సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. వీటికి సాధారణ బస్సుల్లాగా నిర్ణీత మార్గం అంటూ ఉండవు. ప్రయాణికులు ఏయే ప్రాంతాల్లో ఎక్కుతారో బస్సు ఆయా ప్రాం తాల మీదుగా నడుస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేచోట ఉంటే నేరుగా వారి ఇళ్లకు చేరువగా కూడా వెళ్తుంది. ఇది ఇప్పటికి మదిలో ఉన్న ఆలోచన. ట్రాఫిక్ చిక్కులు, ప్రయాణ సమయం, ఇతర ప్రయాణికుల నుంచి వచ్చే వ్యతిరేకత.. తదితరాల ఆధారంగా దీన్ని యథాతథంగా అమలు చేయటం అసాధ్యమనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆలోచనను ఆర్టీసీ దృష్టికి తేవడంతో దాన్ని ఎలాగైనా ఆచరణలోకి తెచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

 మారుమూల గ్రామాలకు మినీ బస్సులు
ఇక మరో వంద నాన్ ఏసీ మినీ బస్సులను మారుమూల గ్రామాలకు నడపనున్నారు. రోడ్డు వసతి సరిగ్గా లేకపోవటం, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో చాలా గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. దీంతో వాటికి మినీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం అనుకూల ఫలితాలనిస్తే క్రమంగా బస్సుల సంఖ్యను పెంచుతారు.

డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ..
ఈ బస్సు డ్రైవర్లకు ‘గైడ్’ తరహా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాలకు సంబంధించిన ప్రత్యేకతలపై వారికి అవగాహన కల్పించనున్నారు. బస్సు బయలుదేరిన తర్వాత ఆయా ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు డ్రైవర్లు వాటి ప్రత్యేకతలను వివరిస్తారు. ఆ మాటలు బస్సులోని స్పీకర్ల ద్వారా ప్రయాణికుల చెవినపడతాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో వాటిని వివరించేలా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, కాస్త భాషా పటుత్వం, విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించారు. దసరా నుంచి ఈ బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement