సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదకరంగా వేళ్లాడుతూ ఆటోలు, జీపుల్లో ప్రయాణించేవారు క్రమంగా బస్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాదిలో 4 శాతం మంది ప్రయాణికులు అదనంగా బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు తేల్చారు. ఏడాది కింద తెలంగాణ ఆర్టీసీ సగటు ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉండగా, గతేడాది కాలంలో సగటు 73 శాతమని తేలింది. పదేళ్ల తర్వాత ఈ రికార్డు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీకి రూ.174 కోట్ల మేర అదనపు ఆదాయం పెరిగింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో బస్సు సర్వీసుల పనితీరును పర్యవేక్షిస్తూ, చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
ఏం చేశారు..
చాలా డిపోల పరిధిలో ఎప్పుడో రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను పట్టించుకోకుండా తిరుగుతున్నాయి. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నా.. బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 69 శాతాన్ని దాటట్లేదు. దీంతో కొందరు ఉన్నతాధికారులు ఓ సాఫ్ట్‌వేర్ రూపొందించి, దీనికి డిపోలను అనుసంధానించారు. ఏ బస్సు ట్రిప్పులో ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందో.. తక్కువ మంది ప్రయాణికులు ఉండే రూట్లు, ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్న మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత సమాచారాన్ని సదరు డిపోలకు ఇచ్చి మార్పులు చేస్తూ వచ్చారు. చాలా ప్రాంతాల్లో ముఖ్య సర్వీసులను ప్రధాన రోడ్లపైనే తిప్పుతున్నారు. కొత్త ట్రిప్పులను కూడా వాటికే జత చేశారు. కొత్త మార్గాలపై దృష్టి పెట్టలేదు. దీంతో బస్సు ట్రిప్పులు వృథా అవుతున్నాయని గుర్తించి కొన్ని సర్వీసుల మార్గాలు మార్చి మిగతావాటి వేళలు సవరించారు. పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రయాణికుల సర్వీసులను వేరు చేసి వేళలు మార్చి నడిపారు. తక్కువ మంది ప్రయాణికులుండే మార్గాలను మార్చి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న ఇతర మార్గాలతో అనుసంధానించారు.
ఆ రెండు కేటగిరీల్లోనే ఎక్కువ
ఆర్టీసీ మొత్తం ప్రయాణికుల్లో 55 శాతం మంది పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనే ప్రయాణిస్తుంటారు. వీటిపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఫలితంగా 2018–19లో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఓఆర్ 75 శాతం నుంచి 78 శాతానికి, పల్లెవెలుగు ఓఆర్ 72 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. ఏయే రూట్లలో ఆర్టీసీకి ఆదరణ ఎక్కువ ఉంది.. ఏయే మార్గాల్లో ఆటోలు, జీపుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారనే విషయంలో సర్వే చేశారు. ఉదాహరణకు గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి గతంలో ప్రత్యేక సర్వీసులు ఉండేవి కావు. భువనగిరికి వెళ్లే బస్సుల్లోనే జనం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ మార్గం దూరం కావటంతో జనం ఆటోల్లో వెళ్లేవారు. ఈ విషయంపై గతంలో ‘సాక్షి’కథనం కూడా ప్రచురించింది. అలాంటి మార్గాలపై దృష్టిపెట్టి డిపో అధికారులకు ప్రత్యేక సూచనలు చేసి కట్ ట్రిప్స్ పెంచారు.
బస్సుల పోదాం చలో చలో..!
Published Sun, Jun 30 2019 2:43 AM | Last Updated on Sun, Jun 30 2019 2:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment