ఆదివారం రాత్రి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ..
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు ముగిశాయి. శనివారం నుంచి అంతా తిరుగు ప్రయాణాల్లో ఉన్నారు. కానీ, శనివారంతో పోలిస్తే ఆదివారం రద్దీ రెండింతలుగా ఉంది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దసరా సెలవుల సందర్భంగా ఆర్టీసీ 4,480 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50% అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దసరా, ఆ మరుసటి రోజు రద్దీ బాగా తగ్గినా, శనివారం నుంచి తిరిగి ఊపందుకుంది. ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడటం మొదలైంది. రిజర్వేషన్ చేయించుకున్న వారి పరిస్థితి పర్వాలేదుగానీ, రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాత ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు సీట్లు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. 50% అదనంగా డబ్బులు చెల్లించినా వేలాడాల్సి రావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డొక్కు బస్సుల్లో కుక్కిపంపుతున్నారు, కనీస శుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అన్నబోర్డు పెట్టి 50% అధిక చార్జీలు వసూలు చేయడం దారుణమని వాపోతున్నారు.
సెలవులు ముగియడంతో..
సోమవారం నుంచి బడులు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారంతా ఆదివారం ఒక్కసారిగా బస్సు ప్రయాణాలను ఎంచుకోవడంతో రద్దీతో బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలామంది ప్రయాణికులు బస్సుల్లో నిలుచుని, మరికొందరు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ రద్దీ బుధవారం వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సువిధ రైళ్లు మినహా తిరుగు ప్రయాణంలోనూ ఎలాంటి ప్రత్యేక సర్వీసులు నడపకపోవడంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోయాయి. రోజుకు 50వేలమంది అధికంగా ప్రయాణం చేస్తున్నా.. అధికారులు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టోల్‌గేట్ల వద్ద రద్దీ..
తెలంగాణలో ముంబై, విజయవాడ, బెంగళూరు, పుణే, వరంగల్ జాతీయ రహదారులు, నార్కట్‌పల్లి– అద్దంకి, రాజీవ్ రహదారిపై కలిపి దాదాపు 18 టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి వాహనదారులు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు ఈ మార్గంలో ప్రయాణించే స్థానికులు, ఆర్టీసీ ప్రయాణికులు కూడా ట్రాఫిక్‌జామ్‌ల కారణంగా ఇబ్బందులు పడ్డారు. టోల్‌గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment