మాదాపూర్‌లో ఏసీ బస్సు షెల్టర్ ముందు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి వన్నె చిన్నెలు అద్దేలా...అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అత్యాధునిక ఏసీ బస్సు షెల్టర్లు మేడిపండు చందంలా మారాయి. అందుబాటులోకి తెచ్చి ఎనిమిది నెలలు దాటినా వాటిల్లో కనీస సదుపాయాల్లేవు. ఒకవైపు వేసవి తరుముకొస్తోంది. ఇప్పటి వరకు ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. ఆధునిక బస్సు స్టేషన్‌లను ప్రారంభించినప్పటి హామీలు అన్నీ అనతికాలంలోనే హుష్‌కాకిలా ఎగిరిపోయాయి. ఇప్పుడు అవి అలంకారప్రాయంగా మాత్రమే మిగిలాయి. నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లలోని ఆధునిక బస్‌షెల్టర్ల దుస్థితి ఇది. మరోవైపు ప్రయాణికులకు కనీస సదుపాయాలతో కూడిన మరిన్ని షెల్టర్లను కట్టించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ మూడు షెల్టర్లు మినహా కొత్తగా ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. బస్సులు ఆగే చోట షెల్టర్లు లేవు. షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగవు. కొన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాణిజ్య ప్రకటనలో కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తి భద్రత. 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి. ఆధునిక టాయిలెట్లు. ఏటీఎం, బస్సుపాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపైన ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అరకొర సదుపాయాలు తప్ప ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రయాణికులకు ఈ బస్‌షెల్టర్లు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
ఎల్‌ఈడీ బోర్డులేవీ.....
దేశంలోనే ఎక్కడా లేని విధంగా కట్టించిన శిల్పారామం, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్ బస్‌షెల్టర్లలో కనీసం బస్సుల రాకపోకలను తెలిపే ఎల్‌ఈడీ బోర్డులు లేవు. బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి రూట్‌లో ప్రతిరోజు వేలాది బస్సులు ఖైరతాబాద్ మీదుగా కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. అలాగే ఉప్పల్, కోఠీ, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి కొండాపూర్ వెళ్లే బస్సులన్నీ శిల్పారామం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ అధికంగా ఉండే ఈ రెండు మార్గాల్లో ఏర్పాటు చేసిన మూడు బస్‌షెల్టర్లలో ఎక్కడా బస్సుల రాకపోకలపైన ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. బస్సుల టైం టేబుల్ లేదు. అనౌన్స్‌మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తారు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినప్పుడు వెళ్లాల్సిందే. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్‌ప్లే ఏర్పాటు పై అటు గ్రేటర్ ఆర్టీసీ, ఇటు జీహెచ్‌ఎంసీ సంస్థలు తమకు ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్‌ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది.’’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్లడమే తమ విధి అని పేర్కొన్నారు.
తాగునీళ్లు కరువే....
చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్‌లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్‌షెల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకితెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ,కాఫీ,స్నాక్స్ వంటివి ప్రయాణికులకు లభిస్తాయన్నారు. 8 నెలలు గడిచినా ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. ఒక్కోషెల్టర్‌లో 3 నుంచి 4 గదులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క చోట కూడా మంచినీటి సదుపాయం లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు ఉన్నాయి.కానీ వాటికి నీటి సరఫరా లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు లేవు. సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కానీ వాటి పనితీరు నామమాత్రమే. సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిఘా అంతంతమాత్రంగానే ఉంది.
ఏసీ అరకొర...
24 గంటల పాటు ఈ షెల్టర్లలో ఏసీ సదుపాయం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు షెల్టర్లలో ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతను భరించలేక బయటకొస్తున్నారు. షెల్టర్ల బయటే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని షెల్టర్లలో ఏసీ ఉన్నప్పటికీ అది ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని, ఉన్నా లేనట్లేనని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్‌షెల్టర్లను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ చేపట్టింది.ఈ మూడింటితో పాటు,దిల్‌సుఖ్‌నగర్, కోఠీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ల వద్ద బస్‌షెల్టర్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు.మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్‌లను నాన్ ఏసీ షెల్టర్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment