ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు! | AC bus service named 'Vajra' with passingers shortage | Sakshi
Sakshi News home page

ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!

Published Thu, May 18 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!

ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!

ఖాళీగా పరుగులెడుతున్న ఏసీ ‘వజ్ర’
ఉప్పల్‌ కూడలి.. రాత్రి ఏడు దాటింది.. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సొచ్చి ఆగింది.
వరంగల్‌ వెళ్లాల్సిన ఆ బస్సులో ఇద్దరే ఉన్నారు.
ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడ్డారు.
కానీ.. డ్రైవర్‌ అనుమతించలేదు.
ఇద్దరు ప్రయాణికులతోనే బస్సు ముందుకు కదిలింది.
ఇది ఈ ఒక్క బస్సు కథ కాదు.
హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నిజామాబాద్‌ మార్గంలో ఆర్టీసీ ప్రారంభించిన వజ్ర బస్సులన్నింటిదీ ఇదే వ్యథ.


ఏమిటీ వజ్ర?
బస్సు ఎక్కేందుకు బస్టాండుకు వెళ్లే పాత పద్ధతికి స్వస్తి పలికి, బస్సులే కాలనీలకు వచ్చే విధంగా ఏసీ మినీ బస్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశంతో ఆర్టీసీ ఇటీవల ‘వజ్ర’ బస్సులు ప్రారంభించింది. హైదరాబాద్‌ నుంచి ప్రధాన పట్టణాలకు మినీ ఏసీ బస్సులు ప్రారంభించాలని గతేడాది జూన్‌లో జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో ఈ నెల ఆరంభంలో తొలివిడతగా 48 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. వీటిలో 30 బస్సులను హైదరాబాద్‌–వరంగల్‌ మధ్య, 18 బస్సులను హైదరాబాద్‌–నిజామాబాద్‌ మధ్య నడుపుతున్నారు. ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లకు కాకుండా నిర్ధారించిన కాలనీల మీదుగా ఈ బస్సులు ప్రయాణిస్తాయి.

మరేంటి సమస్య?
టికెట్‌ కొని బస్సు ఎక్కే విధానం లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. బస్సులో టికెట్‌ ఇచ్చే వీలు లేదు. ఆర్టీసీ కౌంటర్లలో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ద్వారానే సీటు బుక్‌ చేసుకోవాలి. అలాగే వరంగల్‌ మార్గంలో ఉప్పల్‌ కూడలి, నిజామాబాద్‌ మార్గంలో సుచిత్ర కూడలిలోని ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కేంద్రాల్లో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రయాణికులకు అవగాహన లేక బుకింగ్స్‌ తక్కువగా ఉన్నాయి.

రూట్‌ మ్యాపేంటి?
మెహిదీపట్నం, మియాపూర్, కుషాయిగూడ, హైదరాబాద్‌–2ల నుంచి ఈ బస్సులు ఉదయం 4 గంటల నుంచే బయలుదేరుతున్నాయి. ఆయా డిపోల నుంచి ప్రధాన కాలనీల మీదుగా ముందుకు సాగుతాయి. ఉదాహరణకు మెహిదీపట్నం డిపో బస్సు వరంగల్‌ వెళ్లాలంటే.. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయనగర్‌ కాలనీ, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, లిబర్టీ, గగన్‌మహల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట, డీడీ కాలనీ, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్‌ మీదుగా వెళ్తుంది. వరంగల్‌కు రూ.300, నిజామాబాద్‌కు రూ.350 టికెట్‌ ధరగా నిర్ణయించారు. యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఆ వివరాలు  డ్రైవర్‌ వద్ద ఉండే ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఏ కాలనీలో ఎవరు బుక్‌ చేసుకున్నారో, ఏ సమయంలో ఎక్కుతారో తెలుస్తుంది. డ్రైవర్‌ ఫోన్‌ నెంబరు ఇతర వివరాలు ప్రయాణికుడి మొబైల్‌కు మెసేజ్‌ ద్వారా అందుతాయి.

ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 15 నుంచి 18 శాతం ఉంది. 21 సీట్లుండే ఈ బస్సులో నలుగురైదుగురు, ఒక్కోసారి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. బుకింగ్స్‌పై అవగాహనలేని ప్రయాణికులు ఖాళీగా ఉన్న బస్సులను చూసి మార్గ మధ్యలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయాణికులను డ్రైవర్‌ అనుమతించకపోవడంతో.. బస్సు ఖాళీగా ఉన్నా ఎందుకు ఎక్కనీయరంటూ డ్రైవర్‌లతో వాదనకు దిగుతున్నారు.  వెరసి అటు వరంగల్, ఇటు నిజామాబాద్‌ మార్గంలో బస్సులు ఖాళీగా పరుగుపెడుతున్నాయి. వరంగల్, నిజామాబాద్‌లలోనూ ఇవే సమస్యలు ఉండటంతో ఖాళీగా హైదరాబాద్‌ వస్తున్నాయి.

ఇలా చేస్తే బెటరేమో..
► ఆర్టీసీ కౌంటర్‌లలో టికెట్లు జారీ చేసేలా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు టికెట్‌ తీసుకోడానికి ఉపయోగం.
► ఇమ్లీబన్, జూబ్లీబస్టాండ్ల మీదుగా బస్సులను నడపొద్దని నిర్ణయించినందున వరంగల్‌ మార్గంలో తార్నాక, రామంతాపూర్, ఉప్పల్, ఘట్కేసర్‌ లాంటి చోట్ల, నిజామాబాద్‌ మార్గంలో ప్యారడైజ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి లాంటి చోట్ల టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు చేయాలి. లేదంటే డ్రైవర్‌ వద్దనే టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్‌ (టిమ్‌) ఉంచి టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేయాలి.
► బస్సులు తిరిగే కాలనీల్లో వజ్ర బస్సులపై ప్రచారం చేపట్టాలి.     – సాక్షి, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement