స్లీపర్ కోచ్లు మాయం.. ఇక ఏసీల యుగం!!
రైళ్లలో స్లీపర్ కోచ్ అంటే.. సామాన్యులు చాలామంది ఎంచుకునే బోగీ. ఏసీ తరగతి అంటే కాస్తంత ఎగువ మధ్యతరగతి నుంచి ఆ పైవాళ్లు మాత్రమే ప్రయాణిస్తారు. కానీ ఆదాయంపై కన్నేసిన రైల్వేశాఖ క్రమంగా చాలావరకు సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్న స్లీపర్ క్లాస్ బోగీలన్నింటినీ క్రమంగా ఏసీ బోగీలుగా మార్చేయాలని తలపెడుతోంది. ముందుగా ఈ ప్రయోగం దక్షిణ రైల్వేలో మొదలయ్యింది. ఇప్పటికే అక్కడ కొన్ని రైళ్లలో ఒక్కో స్లీపర్ బోగీని తీసేసి.. వాటి స్థానంలో ఏసీ బోగీలు అమరుస్తున్నారు. ఇది గనక విజయవంతం అయితే రాబోయే ఐదారేళ్లలో చాలావరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఏసీలుగా మారిపోతాయి.
ముందుగా ఎర్నాకులం-నిజాముద్దీన్ మంగళా ఎక్స్ప్రెస్ (రైలు నెం. 12617)లోని ఎస్-2 బోగీని ఏసీ బోగీగా మార్చేసి దాని పేరును కూడా బి-4గా మార్చారు. ప్రస్తుతం ఈ రైల్లో 11 స్లీపర్ బోగీలు, మూడు త్రీటైర్ ఏసీ బోగీలు, రెండు టూటైర్ ఏసీ బోగీలు ఉన్నాయి. తాజా మార్పుతో స్లీపర్ బోగీల సంఖ్య 10కి తగ్గి, త్రీటైర్ ఏసీ బోగీలు నాలుగు అవుతాయి. ఎర్నాకులం నుంచి నిజాముద్దీన్ (ఢిల్లీ)కి స్లీపర్ క్లాస్ టికెట్ 925 రూపాయలు కాగా, త్రీటైర్ ఏసీ టికెట్ 2,370 రూపాయలు. అంటే, ఒక్కో ప్రయాణికుడి మీద అదనంగా 1445 రూపాయల చొప్పున భారం పెరుగుతుంది. మొత్తం ఒక బోగీలో ఉండే 72 సీట్లకు కలిపి దాదాపు లక్ష రూపాయల అదనపు ఆదాయం రైల్వే శాఖకు వస్తుంది.