సుఖంగా.. సౌఖ్యంగా ఉండే ప్రయాణం మజా ఇస్తుంది. ఆధునిక కాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఖర్చు కొంత ఎక్కువైనా వెనుకాడే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో ప్రయాణికుల అభీష్టం మేరకు ఏసీ బస్సులను నడుపుతూ ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంటోంది. ఆదాయపరంగానూ ఆర్టీసీ ఖుషీగా ఉంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) బస్సులకు డిమాండ్ అధికమవుతోంది. మునుపటికంటే ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్ ఖుషీ అవుతోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ విజయవాడ రీజియన్‌లో దూర ప్రాంతాలకు మరిన్ని ఏసీ బస్సు సర్వీసులను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది.
కృష్ణా రీజియన్‌లో 90 ఏసీ బస్సులు..
ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 1429 బస్సులు ఉన్నాయి. వీటిలో 277 అద్దె బస్సులు. రీజియన్ నుంచి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలు, నగరాలకు (దూరప్రాంతాలకు) 180 వరకు బస్సులు వెళ్తున్నాయి. వీటిలో 90 ఏసీ బస్సులు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఇంద్ర, నైట్‌రైడర్ వంటి సర్వీసులను ప్రారంభించారు. వీటిని విజయవాడ నుంచి విశాఖపట్నం, ఒంగోలు (ఇంద్ర), మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు నైట్‌రైడర్–స్లీపర్/సీటర్, విశాఖపట్నం, చీరాల, భీమవరంకు ఇంద్ర బస్సులను నడుపుతున్నారు. ఈ ఏసీ సర్వీసులకు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) బాగుంటోంది. వాస్తవానికి ఆర్టీసీలో ఓఆర్ 65 శాతానికి మించితే దానిని లాభదాయక సర్వీసుగా పరిగణిస్తారు. కానీ సగటున ఈ రీజియన్‌లో ఏసీ సర్వీసుల ఓఆర్ 70 వరకు ఉండడంతో కొత్త ఏసీ సర్వీసుల పెంపుపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ రీజియన్‌లో అదనంగా మరో 20 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
కొత్తగా సింగ్‌నగర్ నుంచి..
త్వరలో విజయవాడ శివారు సింగ్‌నగర్ నుంచి పైపుల రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు ఏసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ విజయవాడ నగరంలో వేకువజాము సర్వీసులనూ కొత్తగా ప్రవేశపెట్టింది.
విద్యుత్ బస్సులన్నీ ఏసీవే..
మరోవైపు త్వరలో ఈ రీజియన్‌కు రెండు దశల్లో 280 విద్యుత్ బస్సులు రానున్నాయి. వచ్చే ఈ విద్యుత్ బస్సులు కూడా ఏసీవే. ఇలా కృష్ణా రీజియన్‌లో ఏసీ బస్సు ల సంఖ్య రానున్న రోజుల్లో దాదాపు 390కి చేరువయ్యే అవకాశం ఉంది.
వేకువజాము నుంచి..
ఆర్టీసీ కృష్ణా రీజియన్ కొత్తగా విజయవాడ నగరంలో వేకువజాము సర్వీసులను కూడా ప్రారంభించింది. కొన్ని రైళ్లు విజయవాడ స్టేషన్‌కు రాకుండా ఈ పరిధిలోని రాయనపాడులో ఆగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ దిగే ప్రయాణికుల కోసం ప్రతి రోజూ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సిటీ బస్ పోర్టుకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు.
ఏసీ బస్సులకు డిమాండ్..
కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీ ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏసీ బస్సుల పెంపు ఆవశ్యకత ఏర్పడింది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ సర్వీసులను దూర ప్రాంతాలకు నడుపుతాం.
–జి.నాగేంద్రప్రసాద్, రీజనల్ మేనేజర్, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment