ఆర్టీసీ వెన్నెల బస్సు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ–బెంగళూరుల మధ్య ప్రయాణించే వారికి ఆర్టీసీ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టిక్కెట్ చార్జీలో 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ బస్సులు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. ఆయా స్టేషన్లలో బస్సులు ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం మాత్రం రాయితీ లేకుండా సాధారణ చార్జీనే వసూలు చేస్తారు. వారంలో మిగిలిన అన్ని రోజులు 20 శాతం రాయితీ ఇస్తారు.
విజయవాడ నుంచి బెంగళూరుకు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3870)లో సాధారణ టికెట్టు చార్జి రూ.1,830 కాగా, 20 శాతం రాయితీ పోను రూ.1,490గా నిర్ణయించారు. సాయంత్రం 6.00 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3872)లో సాధారణ టికెట్టు రూ.1,710కు గాను రాయితీ పోను రూ.1,365 వసూలు చేస్తారు. ఇక బెంగళూరు నుంచి రాత్రి 7.30కి విజయవాడ బయలుదేరే వెన్నెల స్లీపరు సర్వీసు (నెం.3871)కు రూ.1,490, రాత్రి 9.00 గంటలకు బయలుదేరే అమరావతి సర్వీసు (నెం.3873)కు రూ.1,365గా టికెట్ ధర నిర్దేశించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎం.వై.దానం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment