ఏసీ బస్టాప్.. ఇక్కడి నుంచి వెళ్తారా?
ఎండలు మండిపోతున్నాయి. బస్సు కోసం వేచి ఉండాలంటే ఒకవైపు తల, మరోవైపు పాదాలు కూడా విపరీతంగా మండుతున్న సెన్సేషన్. పది నిమిషాలు ఉంటే చాలు.. కళ్లు మంటలు, తలనొప్పి వచ్చేస్తున్నాయి. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి కల్పించేందుకు ఏసీ బస్టాపులు వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అవి మన దగ్గర కాదు.. కేవలం దేశ రాజధానిలోనే వచ్చాయి. డైకిన్ కంపెనీ తమ ప్రచారం కోసం ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ బస్టాపు మొత్తాన్ని ఏసీ చేసి పారేసింది. ఈ సంవత్సరం అసలే ఎండలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నాయని, ఇలాంటి సమయంలో ఇది మంచి నిర్ణయమేనని జనం ఈ ప్రయోగాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ కర్టెన్లను ఈ బస్టాపులో ఏర్పాటు చేశారు. అవన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో లోపలి గాలి బయటకు, బయటి గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. అలాగే, ఏ బస్సులు వస్తున్నాయో కూడా తెలుస్తుంది. పనిలో పనిగా లోపల పెట్టిన ఏసీ యూనిట్‌ను గొలుసులతో బంధించారు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఎవరో ఒకరు వచ్చి ఆ ఏసీని కాస్తా పట్టుకెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని ఇలా ముందుజాగ్రత్త తీసుకున్నారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటనల హక్కులు కలిగి ఉన్న డైకిన్ కంపెనీ తమ కంపెనీ ప్రచారంతో పాటు ప్రజలకు కూడా కాస్తంత మేలు జరుగుతుందని ఇలా పెట్టింది. అయితే ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో మాత్రం ఇంకా తెలియదు. గత డిసెంబర్ నెలలో ఒక టెలికం సర్వీస్ ప్రొవైడర్ పలు బస్టాపులలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటంతో అప్పట్లో గాలిని శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటుచేశారు.