lajpat nagar
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు కొత్త మెట్రో లైన్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్-4లో భాగంగా ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, లజపతి నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ వరకు నిర్మాణం చేపట్టనుంది. రూ. 8,339 కోట్లతో ఈ రెండు కొత్త కారిడార్ల నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమవేశమైన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు 8.4 కి.మీ మెట్రో లైన్ ఎనిమిది స్టేషన్లను కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కి.మీ పొడవు ఉంటుందని పేర్కొన్నారు. వీటి మధ్య పది స్టేషన్లు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి 29 నాటికి వీటి నిర్మాణం పూర్తవ్వనున్నట్లు చెప్పారు. దీనితో రాజధాని మెట్రో నెట్వర్క్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 450 కి.మీకి విస్తరించనుంది. ప్రధాని మోదీ అధ్యతన సమవేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి: బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం -
న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!
శ్రీనగర్: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వాజా, మీర్జా నాసర్ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్ మార్కెట్ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్ నగర్ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. తాజాగా రాజస్తాన్ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. -
ఏసీ బస్టాప్.. ఇక్కడి నుంచి వెళ్తారా?
ఎండలు మండిపోతున్నాయి. బస్సు కోసం వేచి ఉండాలంటే ఒకవైపు తల, మరోవైపు పాదాలు కూడా విపరీతంగా మండుతున్న సెన్సేషన్. పది నిమిషాలు ఉంటే చాలు.. కళ్లు మంటలు, తలనొప్పి వచ్చేస్తున్నాయి. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి కల్పించేందుకు ఏసీ బస్టాపులు వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అవి మన దగ్గర కాదు.. కేవలం దేశ రాజధానిలోనే వచ్చాయి. డైకిన్ కంపెనీ తమ ప్రచారం కోసం ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ బస్టాపు మొత్తాన్ని ఏసీ చేసి పారేసింది. ఈ సంవత్సరం అసలే ఎండలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నాయని, ఇలాంటి సమయంలో ఇది మంచి నిర్ణయమేనని జనం ఈ ప్రయోగాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ కర్టెన్లను ఈ బస్టాపులో ఏర్పాటు చేశారు. అవన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో లోపలి గాలి బయటకు, బయటి గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. అలాగే, ఏ బస్సులు వస్తున్నాయో కూడా తెలుస్తుంది. పనిలో పనిగా లోపల పెట్టిన ఏసీ యూనిట్‌ను గొలుసులతో బంధించారు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఎవరో ఒకరు వచ్చి ఆ ఏసీని కాస్తా పట్టుకెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని ఇలా ముందుజాగ్రత్త తీసుకున్నారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటనల హక్కులు కలిగి ఉన్న డైకిన్ కంపెనీ తమ కంపెనీ ప్రచారంతో పాటు ప్రజలకు కూడా కాస్తంత మేలు జరుగుతుందని ఇలా పెట్టింది. అయితే ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో మాత్రం ఇంకా తెలియదు. గత డిసెంబర్ నెలలో ఒక టెలికం సర్వీస్ ప్రొవైడర్ పలు బస్టాపులలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటంతో అప్పట్లో గాలిని శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటుచేశారు. -
రోగులపై వైద్యుల అత్యాచారం
న్యూఢిల్లీ: రెండు వేర్వేరు చోట్ల రోగులపై వైద్యులు రేప్‌లకు పాల్పడ్డారు. రాజధాని ఢిల్లీలో లజపత్‌నగర్‌లోని క్లినిక్‌లో రోగిపై అత్యాచారం జరిపిన 55 ఏళ్ల వైద్యుడు అరెస్టయ్యాడు. సుశీల్ ముంజల్ అనే వైద్యుడు ఈ నెల 2న సొంత క్లినిక్‌లో 24 ఏళ్ల యువతిపై లైంగిక దాడిచేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఛాతీ సమస్యతో అక్కడ చికిత్స పొందుతోంది. చెకప్‌కు వచ్చిన సమయంలో డాక్టర్ తన చాంబర్లోకి పిలిచి రేప్ చేశాడని యువతి ఆరోపించింది. వైద్య పరీక్షల్లో ఆమెపై రేప్ జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. డెంగీ రోగిపై డాక్టర్ అత్యాచారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో భాట్ ప్రాంతంలోని అపోలో ఆసుపత్రిలో వైద్యుడు అత్యాచారం చేశాడని డెంగీకి చికిత్స పొందుతున్న మహిళ ఆరోపించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 2 మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్ రేప్ చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో విచారణ ప్రారంభమైందని ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదని పోలీసులు తెలిపారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.