daikin company
-
డైకిన్ ఏసీలు..మేడిన్ ఆంధ్రా
-
డైకిన్ ఏసీలు.. ఇక మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ.. జపాన్‌కు చెందిన డైకిన్ ఇక నుంచి మేడిన్ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కంపెనీ ప్రతినిధులు, రాయబారుల సమక్షంలో నవంబర్ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్‌ను స్థాపించింది. గతేడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనిట్లలో 75 శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)తో డైకిన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2020–21లో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్ వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగులకు రూ.1.99 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు.. రెండో దశలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 20 లక్షల ఏసీలకు డైకిన్ చేర్చనుంది. 2017లో రాజస్థాన్‌లోని నిమ్రాణాలో రెండో యూనిట్‌ను ప్రారంభించిన డైకిన్ ఏపీలో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు శంకుస్థాపన సమయంలో డైకిన్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ కన్వలజీత్ జావా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేయడంతో రికార్డు స్థాయిలో డైకిన్ ఉత్పత్తికి సిద్ధమైందని తెలిపారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ.. దేశీయ ఏసీ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న సందర్భంగా శ్రీసిటీలో మూడో యూనిట్ అందుబాటులోకి రావడంపై శ్రీసిటీ వ్యవస్థాపక ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ ఎదుగుతోందన్నారు. డైకిన్‌తో పాటు బ్లూస్టార్, లాయిడ్ (హావెల్స్), పానాసోనిక్, యాంబర్, ఈప్యాక్ వంటి అనేక సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఏసీల ఉత్పత్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది. -
డైకిన్ కొత్త పెట్టుబడులు: ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ డైకిన్ ఇండియా రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో ఈ సెంటర్ కోసం కంపెనీ రూ.500 కోట్లు వెచ్చించనుంది. 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. 22 టెస్టింగ్ ఫెసిలిటీలు, ల్యాబ్స్ అందుబాటులోకి తెస్తారు. వచ్చే ఏడాది ఈ ఆర్అండ్డీ సెంటర్ కార్యరూపంలోకి రానుంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్, రాజస్తాన్‌లోని నీమ్రానా వద్ద ఇటువంటి ఆర్అండ్డీ ఫెసిలిటీస్ ఉన్నాయి. భారతీయ వినియోగదారులకు సరిపోయే ఉత్పత్తులతోపాటు విదేశీ కస్టమర్ల కోసం స్థిర, పర్యావరణ అనుకూల సాంకేతికతలను రూపొందించడంపై నూతన కేంద్రం దృష్టి పెడుతుందని డైకిన్ ఇండియా సీఎండీ కె.జె.జావా తెలిపారు. భారతీయ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా తగిన సాంకేతికతలలో ఉత్పత్తులను నిర్మించడానికే కొత్త ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్అండ్డీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. -
పెట్టుబడులకు ఏపీ కీలకం
సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం(తిరుపతి): దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు జపాన్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ ఏసీ కంపెనీ డైకిన్ వెల్లడించింది. భారీ వినియోగం ఉండే మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశమైన శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్జీత్ జావా తెలిపారు. శ్రీసిటీలో గురువారం డైకిన్ ఏసీ తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, ఫ్యుజిత సీనియర్ ఎండీ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కన్వాల్జీత్ జావా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ.. తమ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు అవసరమైన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థను విస్తరించడం, సమతుల్యం చేయడం లక్ష్యంగా సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్యూహంలో (ప్యూజన్–2025) భాగంగా ఈ పెట్టుబడి చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. శ్రీసిటీ ఫ్యాక్టరీ çవ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. కేవలం ఏసీ తయారీనే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఉత్పత్తి సేవలను అందించనున్నట్లు తెలిపారు. అంచెలంచెలుగా పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు జావా వెల్లడించారు. శ్రీసిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్లో 75.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్లాంట్ జూలై 2023 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే, సంవత్సరానికి 1.5 మిలియన్ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెసర్లు, కంట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారుచేయగల ఈ ప్లాంట్ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది డైకిన్‌కు దేశంలో మూడో కేంద్రం కాగా.. అతిపెద్ద తయారీ కేంద్రం కూడా. భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ మాట్లాడుతూ.. జపాన్–భారత్ ఆర్థిక భాగస్వామ్యానికి ఇది మరో ముందడుగుగా అభివర్ణించారు. గత నెలలో జపాన్, భారత్ ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెద్దఎత్తున బలపడేందుకు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు. అలాగే, భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల మేర జపాన్ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు డైకిన్ ఇండియా తొలి అడుగు వేసిందన్నారు. కోవిడ్ తర్వాత తొలి భారీ పెట్టుబడి ఇది.. ఇక దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్‌వన్‌గా వున్న ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల నిమిత్తం డైకిన్ గ్రూప్ ఎంపిక చేసుకున్నందుకు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలియచేశారు. కోవిడ్ అనంతరం అధికారికంగా, పెద్దఎత్తున నిర్వహించిన పరిశ్రమ భూమిపూజ కార్యక్రమం ఇదేనని.. అలాగే, పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద దక్షిణాదిలో ఏర్పాటవుతున్న తొలి భారీ తయారీ కేంద్రం కూడా ఇదేనన్నారు. శ్రీసిటీ జపనీస్ ఎనక్లేవ్లో ఇది 27వ జపాన్ కంపెనీ అని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో జపాన్ ప్రతినిధుల కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించామని.. త్వరలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రవీంద్ర తెలిపారు. -
ఏసీల తయారీ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పాలసీ సత్ఫలితాలిస్తోంది. ఈ పాలసీ ఆధారంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన డైకిన్ సంస్థ రాష్ట్రంలోని శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు కోసం 75 ఎకరాలు కొనుగోలు చేసింది. తాజాగా బ్లూస్టార్ సంస్థ శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేసింది. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్, బ్లూస్టార్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీపీ ముకుంద మీనన్, వైస్ ప్రెసిడెంట్ వి.కసటేకర్, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పాలసీతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, త్వరలోనే రాష్ట్రం దేశానికి ఏసీ తయారీ హబ్‌గా ఎదగనుందని చెప్పారు. స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, చక్కని పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే డైకిన్, బ్లూస్టార్ కంపెనీలు ముందుకురాగా మరో రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపుతున్నట్లు తెలిపారు. ఏసీలు, రిఫ్రిజరేటర్లు వంటి వైట్ గూడ్స్ రంగం ద్వారా రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్ సంస్థకు దేశంలో ఇది 6వ ఉత్పాదక యూనిట్‌కాగా.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిదని చెప్పారు. శ్రీసిటీ దేశీయ టారిఫ్ జోన్ (డీటీజడ్)లోని 20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ను దశల వారీగా రూ.540 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ యూనిట్లకు దగ్గరగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,500 మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక పథకం కింద రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4 టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా దక్షిణ భారతదేశ అవసరాలను తీర్చనున్నామన్నారు. శ్రీసిటీని తొలిసారి సందర్శించినప్పుడే ఇక్కడి సౌకర్యాలను చూసి యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. -
ఏపీలో డైకిన్ భారీ యూనిట్
సాక్షి, అమరావతి/చిత్తూరు: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్–ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) కింద ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్ ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి రెండింటి మధ్య ఒప్పందం కుదిరినట్లు శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీసిటీలో జరిగిన కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్జీత్ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. చదవండి: చక్కగా సంరక్షిస్తే ‘దత్తత’కు ఓకే శ్రీసిటీలో డైకిన్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిశ్రమ ప్రతినిధులు మూడువేల మందికి ఉపాధి ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని, 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైకిన్ తెలిపింది. దిగుమతులను తగ్గించి స్వయం సంవృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 13 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీగా డైకిన్ రికార్డు సృష్టించింది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర అధికారులు పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అపారమైన అవకాశాలున్న దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కన్వల్జీత్ జావా తెలిపారు. ఇప్పటికీ 5–6 శాతం మంది మాత్రమే ఏసీ వినియోగిస్తుండడంవల్ల ఈ రంగం వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఉత్పత్తుల కోసం దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ దిశగా తాము కృషిచేస్తున్నామని.. ఇందుకోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా, మధ్య ఆసియా దేశాల ఎగుమతులకు ఏపీ కీలకంగా ఉండటంతో దీన్ని ఆఫ్‌షోర్ డెలివరీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన వాతావరణంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు, నైపుణ్య కలిగిన మానవ వనరులు ఉండటం కూడా తమకు కలిసొచ్చే అంశాలుగా కన్వల్జీత్ జావా పేర్కొన్నారు. శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటులో పూర్తిగా సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాదిలో తొలి యూనిట్ ఇక దేశంలో ఇప్పటికే రెండు యూనిట్లు కలిగి ఉన్న డైకిన్.. దక్షిణాలో తొలి యూనిట్ ఏర్పాటుకు శ్రీ సిటీని ఎంచుకోవడం గర్వంగా ఉందని ఆ సంస్థ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన జపాన్ దిగ్గజ సంస్థ డైకిన్ గ్రూప్ శ్రీసిటీకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది శ్రీ సిటీకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపారానికి కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అనువైన వాతావరణంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. -
ఏపీలో ఉత్పత్తికి సిద్ధమైన ‘డైకీ’
సాక్షి, అమరావతి: వందేళ్ల చరిత్ర కలిగిన జపాన్ దిగ్గజ ఉక్కు సంస్థ ‘డైకీ’ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తికి సిద్ధమైంది. డైకీ అల్యూమినియం సంస్థకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న తమ ప్లాంట్ వివరాలను మంత్రికి వెల్లడించారు. ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు, సంస్కరణలను గురించి డైకీ ప్రతినిధులకు మంత్రి వివరించడంతో.. ఏపీ అభివృద్ది దిశగా ముందుకెళుతోందని వారు హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉక్కును అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముందుకు వెళుతున్న డైకీ సంస్థను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. డైకీ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపడతామని వారితో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
ఏసీ బస్టాప్.. ఇక్కడి నుంచి వెళ్తారా?
ఎండలు మండిపోతున్నాయి. బస్సు కోసం వేచి ఉండాలంటే ఒకవైపు తల, మరోవైపు పాదాలు కూడా విపరీతంగా మండుతున్న సెన్సేషన్. పది నిమిషాలు ఉంటే చాలు.. కళ్లు మంటలు, తలనొప్పి వచ్చేస్తున్నాయి. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి కల్పించేందుకు ఏసీ బస్టాపులు వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అవి మన దగ్గర కాదు.. కేవలం దేశ రాజధానిలోనే వచ్చాయి. డైకిన్ కంపెనీ తమ ప్రచారం కోసం ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ బస్టాపు మొత్తాన్ని ఏసీ చేసి పారేసింది. ఈ సంవత్సరం అసలే ఎండలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నాయని, ఇలాంటి సమయంలో ఇది మంచి నిర్ణయమేనని జనం ఈ ప్రయోగాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ కర్టెన్లను ఈ బస్టాపులో ఏర్పాటు చేశారు. అవన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో లోపలి గాలి బయటకు, బయటి గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. అలాగే, ఏ బస్సులు వస్తున్నాయో కూడా తెలుస్తుంది. పనిలో పనిగా లోపల పెట్టిన ఏసీ యూనిట్‌ను గొలుసులతో బంధించారు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఎవరో ఒకరు వచ్చి ఆ ఏసీని కాస్తా పట్టుకెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని ఇలా ముందుజాగ్రత్త తీసుకున్నారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటనల హక్కులు కలిగి ఉన్న డైకిన్ కంపెనీ తమ కంపెనీ ప్రచారంతో పాటు ప్రజలకు కూడా కాస్తంత మేలు జరుగుతుందని ఇలా పెట్టింది. అయితే ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో మాత్రం ఇంకా తెలియదు. గత డిసెంబర్ నెలలో ఒక టెలికం సర్వీస్ ప్రొవైడర్ పలు బస్టాపులలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటంతో అప్పట్లో గాలిని శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటుచేశారు.