పెట్టుబడులకు ఏపీ కీలకం | Daikin India MD Kanwaljit Java comments on Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ఏపీ కీలకం

Published Fri, Apr 8 2022 5:30 AM | Last Updated on Fri, Apr 8 2022 10:36 AM

Daikin India MD Kanwaljit Java comments on Andhra Pradesh - Sakshi

పరిశ్రమకు పునాది రాయి వేస్తున్న కన్వాల్‌జీత్‌

సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం(తిరుపతి): దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్‌ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు జపాన్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ ఏసీ కంపెనీ డైకిన్‌ వెల్లడించింది. భారీ వినియోగం ఉండే మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశమైన శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్‌జీత్‌ జావా తెలిపారు. శ్రీసిటీలో గురువారం డైకిన్‌ ఏసీ తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ మసయుకి టాగా, ఫ్యుజిత సీనియర్‌ ఎండీ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కన్వాల్‌జీత్‌ జావా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ.. తమ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు అవసరమైన గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ వ్యవస్థను విస్తరించడం, సమతుల్యం చేయడం లక్ష్యంగా సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్యూహంలో (ప్యూజన్‌–2025) భాగంగా ఈ పెట్టుబడి చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. శ్రీసిటీ ఫ్యాక్టరీ çవ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. కేవలం ఏసీ తయారీనే కాకుండా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలు, ఉత్పత్తి సేవలను అందించనున్నట్లు తెలిపారు. అంచెలంచెలుగా పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు జావా వెల్లడించారు. శ్రీసిటీ డొమెస్టిక్‌ టారిఫ్‌ జోన్‌లో 75.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్లాంట్‌ జూలై 2023 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే, సంవత్సరానికి 1.5 మిలియన్‌ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెసర్లు, కంట్రోలర్‌ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారుచేయగల ఈ ప్లాంట్‌ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది డైకిన్‌కు దేశంలో మూడో కేంద్రం కాగా.. అతిపెద్ద తయారీ కేంద్రం కూడా. 

భారత్‌లోని జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ మాట్లాడుతూ.. జపాన్‌–భారత్‌ ఆర్థిక భాగస్వామ్యానికి ఇది మరో ముందడుగుగా అభివర్ణించారు. గత నెలలో జపాన్, భారత్‌ ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెద్దఎత్తున బలపడేందుకు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు. అలాగే, భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల మేర జపాన్‌ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు డైకిన్‌ ఇండియా తొలి అడుగు వేసిందన్నారు.

కోవిడ్‌ తర్వాత తొలి భారీ పెట్టుబడి ఇది..
ఇక దేశంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నెంబర్‌వన్‌గా వున్న ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల నిమిత్తం డైకిన్‌ గ్రూప్‌ ఎంపిక చేసుకున్నందుకు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలియచేశారు. కోవిడ్‌ అనంతరం అధికారికంగా, పెద్దఎత్తున నిర్వహించిన పరిశ్రమ భూమిపూజ కార్యక్రమం ఇదేనని.. అలాగే, పీఎల్‌ఐ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌) స్కీం కింద దక్షిణాదిలో ఏర్పాటవుతున్న తొలి భారీ తయారీ కేంద్రం కూడా ఇదేనన్నారు. శ్రీసిటీ జపనీస్‌ ఎనక్లేవ్‌లో ఇది 27వ జపాన్‌ కంపెనీ అని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. కోవిడ్‌ సమయంలో జపాన్‌ ప్రతినిధుల కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించామని.. త్వరలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రవీంద్ర తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement