ఏసీ వోల్వో బస్సుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆర్టీసీ ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: ఏసీ వోల్వో బస్సుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆర్టీసీ ప్రకటించింది. ఏసీ బస్సుల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. టీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు దాదాపు రూ.5 లక్షల వరకు అదనంగా చెల్లించినట్టు ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఖండిస్తూ ఆర్టీసీ ఈడీ రవీందర్ ఓ ప్రకటన జారీ చేశారు. గత జనవరిలో 10 ఏసీ బస్సుల కోసం టెండర్లు పిలవగా వోల్వో, స్కానియా కంపెనీలు స్పందించాయని, స్కానియా కంపెనీ రూ.1,08,85,481, వోల్వో రూ.1,06,85,000 చొప్పున కోట్ చేశాయని తెలిపారు.
చర్చల తర్వాత రెండు కంపెనీలు రూ.1,05,10,000, రూ.1,04,85,000 చొప్పున ఖరారు చేశాయని, దీంతో వోల్వో బస్సులు కొనేందుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అంతకు ఆరు నెలల ముందు వోల్వో కంపెనీ ఏపీఎస్ ఆర్టీసీకి ఇంతకంటే తక్కువ ధరకే ఇచ్చినప్పటికీ, ఉత్పత్తి వ్యయం, ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ ఆ ధరకు ఇచ్చేందుకు అంగీకరించలేదని తెలిపారు. స్కానియా కొత్త కంపెనీ అయినందున ఆ కంపెనీ బస్సుల పనితీరుపై ఇంకా స్పష్టత రాలేదని, వోల్వో బస్సుల పనితీరుపై చాలాకాలంగా అవగాహన ఉన్నందున దానివైపు మొగ్గుచూపామని తెలిపారు.