బెస్ట్ నష్ట నివారణ చర్యలు
* కలెక్షన్లు లేని బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం
* మోనో ప్రయాణికులతో నెలకోసారి చర్చ
* పాఠశాలల్లోనే పాస్‌ల పంపిణీకి ప్రయత్నం
సాక్షి, ముంబై: బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు నడుం బిగించారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రవేశపెట్టాల్సిన పథకాలపై స్థాయి సమితిలో చర్చలు జరిపారు.
ముఖ్యంగా కలెక్షన్లు లేని ఏసీ బస్సులను పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, విహార యాత్రలకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించారు. గత కొంత కాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో అనుకున్నంత మేర ఆదాయం రావడం లేదు. దీంతో కలెక్షన్లు లేని కొన్ని రూట్లలో బస్సులు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయంతోపాటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు అధికారుల చేపడుతున్నారు.
ఇందుకోసం మెట్రో, మోనో రైలు ప్రయాణికులతో నెలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. వారిచ్చే సలహాలు, సూచనలను విని ఆ తరువాత బస్సు రాకపోకల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. మెట్రో, మోనో రైలు ప్రయాణికులు అధిక శాతం బెస్ట్ బస్సుల కోసం వేచిచూడడం లేదు. స్టేషన్ బయట అందులో బాటులో ఉన్న షేర్ ఆటోలు, ట్యాక్సీలలో వెళుతున్నారు. దీనికి బస్ చార్జీల పెంపు కారణంగా కనిపిస్తోంది. పెంచిన చార్జీల వల్ల బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోగా.. లోకల్ రైళ్లలో ఏడాది కాలంలో మూడు కోట్లకు మందికిపైగా పెరిగిపోయారు.
సీజన్ పాస్ చార్జీలు కూడా దాదాపు రెట్టింపు పెంచడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే విద్యార్థులకు పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు. అందుకు 10 పాఠశాలల యాజమాన్యాలు సానుకూలంగా వ్యవహరించినట్లు బెస్ట్ జనరల్ మేనేజరు జగదీశ్ పాటిల్ చెప్పారు. వృథాగా పడి ఉన్న బెస్ట్ డిపో స్థలాలను లీజుకిచ్చే అంశంపై కూడా చర్చలు జరిపారు. అందులో హోటల్, టూరిస్టు ఏజంట్లకు, క్రూజ్ సఫారీ తదితర వ్యాపారాలకు అద్దెకు ఇవ్వాలని చర్చలు జరిపారు.