విశాఖ టు సింగపూర్‌ | International cruise services from March | Sakshi
Sakshi News home page

విశాఖ టు సింగపూర్‌

Published Thu, Jan 4 2024 5:15 AM | Last Updated on Thu, Jan 4 2024 8:41 AM

International cruise services from March - Sakshi

విశాఖ సిటీ:  ప్రపంచ పర్యాటక పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించేలా అంతర్జాతీయ క్రూయిజ్‌ పర్యాటకం మార్చిలో ప్రారంభమవుతుందని విశాఖ పోర్ట్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టు ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టు అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పోర్టు ప్రగతిని వివరించారు. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణం ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్‌కు క్రూయిజ్‌ నడిపేందుకు లిట్టోరల్‌ క్రూయిల్‌ లిమిటెడ్‌ సంస్థలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్‌ సర్విసులు నిర్వహించేందుకు లిట్టోరల్‌ సంస్థ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నుంచి థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్లకు కూడా క్రూయిజ్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 

80 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా లక్ష్యం 
పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో 74 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 60 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా..వచ్చే మార్చి నాటికి పోర్టు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 80 మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కేవలం ఆదాయార్జనపైనే కాకుండా..జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ.. ఆధునికీకరణ, యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తూ.. నాణ్యతపై దృష్టి పెట్టినట్లు వివరించారు.

కార్బన్‌ రహిత పోర్టుగా.. 
విశాఖ పోర్టును కార్బన్‌ రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోనే కేవలం సోలార్‌ పవర్‌లో నిర్వహిస్తున్న ఏకైక పోర్టుగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌తో విద్యుత్‌ అవసరాలలో స్వయం సంమృద్ధిని సాధించగా..మరో 30 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ స్థాయిలో 5.65 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి 
♦ శీఘ్ర సరకు రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధిపై దృష్టి  
♦  ప్రస్తుతం విశాఖ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43 శాతం,  
♦    రైలు ద్వారా 26 శాతం, పైప్‌లైన్‌ ద్వారా 21 శాతం,  
♦  కన్వేయర్ల ద్వారా 10 శాతం సరకు రవాణా  
♦  రైలు ద్వారా 60 శాతం రవాణా చేయాలన్న లక్ష్యంతో విద్యుత్‌లైన్లతో రైలు మార్గం అభివృద్ధి  
♦  ఆటంకం లేకుండా పోర్టు నుంచి రోడ్డు మార్గాల ద్వారా సరకు రవాణాకు రూ.501.65 కోట్లతో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి  
♦ కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రోడ్డును 10 లైన్లకు విస్తరణ  
♦  20 శాతం సరకు రవాణాకు కోస్టల్‌  షిప్పింగ్‌కు చర్యలు  

 2030 నాటికి పూర్తి ల్యాండ్‌ లార్డ్‌ పోర్టుగా...
♦ వచ్చే ఐదేళ్లలో పీపీపీ టెర్మినల్స్‌ ద్వారానే మొత్తం సరకులో 75 శాతాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు 
♦ 2030 చివరి నాటికి 100 శాతం కార్గో రవాణా పీపీపీ టెర్మినల్స్‌ ద్వారానే నిర్వహించాలని లక్ష్యంగా 
♦  2030 నాటికి విశాఖపట్నం పోర్టు పూర్తి ల్యాండ్‌ లార్జ్‌ పోర్టుగా మార్పు  
♦  అసెట్‌ లైట్‌ మోడల్‌ విధానంలో పీపీపీ పద్ధతిలో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం  
♦    డబ్ల్యూ క్యూ 7, 8 బెర్తులు ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6 బెర్త్‌ యంత్రీకరణ పనులు  
♦  మరో బెర్త్‌ ఈక్యూ 6 యంత్రీకరణ పనులను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు రంగం సిద్దం  
♦ ఒకవైపు పోర్టు అభివృద్ధిపైనే కాకుండా కాలుష్య నియంత్రణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి  
♦ ఇందులో భాగంగా రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు జంక్షన్‌ నుంచి మారియట్‌ హోటల్‌ వరకు రోడ్డు అభివృద్ధికి పోర్టు బోర్డు అంగీకారం.   
♦ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement