హైదరాబాద్‌ టు సింగపూర్‌ | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు సింగపూర్‌

Published Wed, Jul 10 2024 11:24 AM | Last Updated on Wed, Jul 10 2024 1:25 PM

హైదరా

హైదరాబాద్‌ టు సింగపూర్‌

నగరం నుంచి పెరుగుతున్న పర్యాటకులు  పర్యాటకం ద్వారా సింగపూర్‌కు భారీ ఆదాయం

 

సాక్షి, సిటీబ్యూరో: సింగపూర్‌ టూరిజం బోర్డు కన్ను హైదరాబాద్‌ మీదకు మళ్లింది. హైదరాబాదీల్లో పర్యాటకం పట్ల పెరుగుతున్న ఆసక్తి సింగపూర్‌కు కనకవర్షం కురిపిస్తోంది. సింగపూర్‌కు వెళ్లి రావడాన్ని మనోళ్లు వీకెండ్‌లో తమ సొంతూరికి వెళ్లివచ్చినట్లు భావిస్తున్నారు. అందుకు సాక్ష్యం ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో చేసిన ప్రయాణాలే. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఐదు లక్షలకు పైగా పర్యాటకులు భారత్‌ నుంచి సింగపూర్‌ విమానం ఎక్కారు. అందులో సింహభాగం హైదరాబాదీలే అంటున్నారు సింగపూర్‌ టూరిజమ్‌ బోర్డుకు చెందిన ఇండియా, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ సౌత్‌ ఏషియా ఏరియా డైరెక్టర్‌ వాంగ్‌ రేంజీ. సింగపూర్‌ గురించిన మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే...

ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెకేషన్‌
సింగపూర్‌ ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ మనిషి నిర్మించిన హరితసౌధం. మాన్‌మేడ్‌ నేచర్‌ అనవచ్చు. చెంగి ఎయిర్‌పోర్టు ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇందులో 14 మీటర్ల వాటర్‌ఫాల్‌ ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్‌ వాటర్‌ ఫాల్‌. ఎయిర్‌పోర్టులో రకరకాల చెట్లు, మొక్కలు 63 వేలున్నాయి. మామూలుగా ఎయిర్‌పోర్టు అంటే రవాణా సదుపాయ కేంద్రం మాత్రమే. కానీ చెంగి ఎయిర్‌పోర్టును టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మలుచుకున్నాం. హాట్‌ ఐలాండ్‌ అయిన సింగపూర్‌ని కూల్‌గా మార్చింది మాన్‌మేడ్‌ గ్రీనరీనే. ఇది గార్డెన్‌ సిటీ కాదు, సిటీ ఇన్‌ గార్డెన్‌ అంటాం. జెన్‌ జెడ్‌ నుంచి, న్యూలీ మ్యారీడ్‌ కపుల్‌, పిల్లలతో వచ్చే కుటుంబాలు అన్నీ సంతోషంగా గడిపే విధంగా ఉంటుంది. క్రూయిజ్‌లో నైట్‌ స్టే చేయడం నుంచి కోరల్‌ రీవ్స్‌ను చుట్టి రావడం, కనోపీ ట్రీ గార్డెన్‌ మీద స్కై వాక్‌... ప్రతిదీ గొప్ప అనుభూతిగా మిగులుతుంది.

యూపీఐతో చెల్లింపులు
డిజిటల్‌ పేమెంట్స్‌ విస్తృతంగా వాడుకలోకి వచ్చిన నేపథ్యంలో సింగపూర్‌ ఫోన్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్‌ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సింగపూర్‌ వెళ్లే ముందు కరెన్సీ మార్పిడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సింగపూర్‌లో ఎక్కడ షాపింగ్‌ చేసినా, హోటల్‌లో బస చేసినా మనం యూపీఐ ద్వారా చెల్లిస్తే ఆటోమేటిగ్గా ఆ రోజు మారకం విలువను బట్టి సింగపూర్‌ డాలర్‌లోకి కన్వర్ట్‌ అవుతుంది. మనకు రూపాయల్లో ఎంత చెల్లించిందీ స్పష్టంగా కనిపిస్తుంది.

బడ్జెట్‌లో వెళ్లి రావచ్చు
పర్యాటక ప్యాకేజీలు మధ్య తరగతి వాళ్లకు కూడా అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. సింగపూర్‌ ఎలాంటిదంటే ఓ లక్ష రూపాయలతో ఒక రోజు గడపవచ్చు, అదే లక్ష రూపాయలతో ఏడాది పాటూ నివసించవచ్చు. స్కై ఈజ్‌ లిమిట్‌ అనేది ఎంత నిజమో పైసా వసూల్‌లాగ కూడా టూర్‌ చేయవచ్చు. నేరుగా టికెట్‌ కొనుక్కుని విమానం ఎక్కేసి సింగపూర్‌లో దిగినా సరే ఎవరి బడ్జెట్‌కు తగినట్లు వాళ్లు రోజును గడపవచ్చు. ఇండియాలోని 17 నగరాలు సింగపూర్‌తో కనెక్ట్‌ అయి ఉన్నాయి. ఈ నగరాల నుంచి సింగపూర్‌కి వారానికి 288 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్‌ టూ సింగపూర్‌ సర్వీసులదే ప్రథమ స్థానం.

పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీస్‌
హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కి వెళ్లే టూరిస్టుల్లో మహిళలు, సోలో ట్రావెలర్స్‌ కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అలా వచ్చిన వారికి కూడా సురక్షితమైన ప్రదేశం సింగపూర్‌. పోలీస్‌ సేవలు పీపుల్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. సోలో విమెన్‌కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించే వ్యవస్థ ఉంది.

దక్షిణాది రాష్ట్రాలకూ సింగపూర్‌కి ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకు అనేక విషయాల్లో అవినాభావ బంధం ఉంది. హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు ఎక్కువ కావడంతో మెనూలో బిర్యానీని చేర్చాం. దక్షిణాది రుచుల రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న విజయన్‌, ఇతర దక్షిణాది వంటల్లో నిష్ణాతులైన షెఫ్‌లు టూరిజమ్‌ బోర్డుతో కలిసి పని చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన పర్యాటకులు ఇడ్లీ, దోసె, రోటీలతో తమ ఇంటి భోజనాన్ని ఆస్వాదించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
హైదరాబాద్‌ టు సింగపూర్‌ 1
1/1

హైదరాబాద్‌ టు సింగపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement