విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. పర్యాటక రంగంలో కీలకమైన క్రూయిజ్ సేవలందించేందుకు ఈసారి రెండు నౌకలుసిద్ధమవుతున్నాయి. సాగర జలాల్లో మూడు రోజులపాటు విహరిస్తూ.. విశాఖ నుంచి దక్షిణ భారత దేశంలోని పలు నగరాలకు సర్వీసులు నడిపేందుకు క్రూయిజ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మే నెల నుంచి ఎంఎస్‌సీ సంస్థ, జూన్ నుంచి కార్డిలియా సంస్థ సర్వీసులను ప్రారంభించనున్నాయి. మరోవైపు విశాఖపట్నం పోర్టులో నిర్మిస్తున్న క్రూయిజ్ టెర్మినల్ మే నాటికి అందుబాటులోకి రానుంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
తేడాది విశాఖ నుంచి చెన్నైకు సర్వీసులు నడిపిన ఎంప్రెస్ సంస్థకు చెందిన కార్డిలియా క్రూయిజ్ నౌక తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు మధురానుభూతిని అందించింది. ఇప్పుడు దాంతోపాటు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా లండన్, వెనిస్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు నడిపిస్తున్న ఎంఎస్‌సీ క్రూయిజ్ సంస్థ కూడా విశాఖ కేంద్రంగా సేవలకు సిద్ధమైంది.
ఈ రెండు సంస్థల ప్రతినిధులు రెండు రోజుల క్రితం విశాఖపట్నం పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపారు. వీటికి అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. ఎంఎస్‌సీ క్రూయిజ్ మే నుంచి, కార్డిలియా నౌక జూన్ నుంచి సర్వీసులు నడపనుంది. ప్రతి మూడు రోజులకోసారి రోజు విడిచి రోజు నడిపించేలా పోర్టు అధికారులు వీటికి బెర్తులు అందించనున్నారు. ఒక్కో క్రూయిజ్ ఆరు నెలల పాటు విశాఖ నుంచి సర్వీసులు నడపనుంది. త్వరలోనే సర్వీసుల వివరాలను ఈ సంస్థలు ప్రకటించనున్నాయి.
క్రూయిజ్‌లలో ఎన్నో సౌకర్యాలు
ఈ క్రూయిజ్ నౌకలలో ప్రయాణించే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయి. ఒక్కోటి 11 అంతస్తులుండే ఈ భారీ నౌకల్లో ఒకేసారి 1,500 నుంచి 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు. వీటిలో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్ షోలు ఉంటాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి.
చురుగ్గా టెర్మినల్ నిర్మాణం
విశాఖ పోర్టులోని గ్రీన్‌చానెల్‌లో రూ.72.26 కోట్లతో నిర్మిస్తున్న క్రూయిజ్ బెర్త్, టెర్మినల్ బిల్డింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మే నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా టెర్మినల్‌లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణంగా బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఇక్కడ 330 మీటర్ల భారీ పొడవైన బెర్త్ నిర్మిస్తున్నారు.
15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్‌డ్ డెప్త్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ విశాలమైన బెర్త్ పైకి క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే కార్గో నౌకల్ని కూడా అనుమతిస్తారు. అంతర్జాతీయ పర్యాటకుల ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్‌ని నిర్మిస్తున్నారు.
2 వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తోపాటు పరిపాలన భవనం, కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్‌వేస్, రెస్టారెంట్, లాంజ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్స్, షాపింగ్ మాల్స్, రెస్ట్‌రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి. గరిష్టంగా 2,500 మంది పర్యాటకులు రావొచ్చు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు నిరంతరాయంగా ఉండే అవకాశాలున్నాయని పోర్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment