సాక్షి, గుంటూరు: ఏపీకి కాబోయే పాలనా రాజధాని విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఇవాళ(శుక్రవారం) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ బుక్స్‌ను ఆవిష్కరించారు.
మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో.. ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ భాషల్లో పుస్తకాలు.. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూనే.. రాష్ట్రంలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపరిచారు.
అంతేకాదు.. బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ.. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు టూరిజం శాఖ అధికారులు. దీంతో అభినందించిన సీఎం జగన్.. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవెన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment