BEST Organization
-
బెస్ట్ నష్ట నివారణ చర్యలు
* కలెక్షన్లు లేని బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం * మోనో ప్రయాణికులతో నెలకోసారి చర్చ * పాఠశాలల్లోనే పాస్‌ల పంపిణీకి ప్రయత్నం సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు నడుం బిగించారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రవేశపెట్టాల్సిన పథకాలపై స్థాయి సమితిలో చర్చలు జరిపారు. ముఖ్యంగా కలెక్షన్లు లేని ఏసీ బస్సులను పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, విహార యాత్రలకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించారు. గత కొంత కాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో అనుకున్నంత మేర ఆదాయం రావడం లేదు. దీంతో కలెక్షన్లు లేని కొన్ని రూట్లలో బస్సులు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయంతోపాటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు అధికారుల చేపడుతున్నారు. ఇందుకోసం మెట్రో, మోనో రైలు ప్రయాణికులతో నెలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. వారిచ్చే సలహాలు, సూచనలను విని ఆ తరువాత బస్సు రాకపోకల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. మెట్రో, మోనో రైలు ప్రయాణికులు అధిక శాతం బెస్ట్ బస్సుల కోసం వేచిచూడడం లేదు. స్టేషన్ బయట అందులో బాటులో ఉన్న షేర్ ఆటోలు, ట్యాక్సీలలో వెళుతున్నారు. దీనికి బస్ చార్జీల పెంపు కారణంగా కనిపిస్తోంది. పెంచిన చార్జీల వల్ల బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోగా.. లోకల్ రైళ్లలో ఏడాది కాలంలో మూడు కోట్లకు మందికిపైగా పెరిగిపోయారు. సీజన్ పాస్ చార్జీలు కూడా దాదాపు రెట్టింపు పెంచడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే విద్యార్థులకు పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు. అందుకు 10 పాఠశాలల యాజమాన్యాలు సానుకూలంగా వ్యవహరించినట్లు బెస్ట్ జనరల్ మేనేజరు జగదీశ్ పాటిల్ చెప్పారు. వృథాగా పడి ఉన్న బెస్ట్ డిపో స్థలాలను లీజుకిచ్చే అంశంపై కూడా చర్చలు జరిపారు. అందులో హోటల్, టూరిస్టు ఏజంట్లకు, క్రూజ్ సఫారీ తదితర వ్యాపారాలకు అద్దెకు ఇవ్వాలని చర్చలు జరిపారు. -
రైలు ప్రమాదాలపై ‘బెస్ట్’ అవగాహన
సాక్షి, ముంబై: బెస్ట్ బస్సుల్లోని సీసీటీవీలలో రైలు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. నగర శివారులో జరుగుతున్న ఫ్రమాదాల్లో రోజూ దాదాపు 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో బెస్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ, రాధీ డిజాస్టర్ విద్యా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. కాగా ప్రయాణికులు నడుస్తున్న రైలును ఎలా ఎక్కుతున్నారు.. రైలు పట్టాలు దాటుతూ ఎలా మృత్యువాత పడుతున్నారు.. అదేవిధంగా రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. తదితర అంశాలను బెస్ట్ బస్సుల్లోని టీవీలపై చూపించేందుకు అధికారులు నిర్ణయించారు. రైళ్లలో విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని ప్రయాణికులకు తెలియజెప్పడమే తమ ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రధి డిజాస్టర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రితా సావ్లా మాట్లాడుతూ.. మొదటి విడతలో తాము రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను బెస్ట్ బస్సుల్లోని టీవీలలో చూపించనున్నట్లు తెలిపారు. తర్వాత రోడ్డు ప్రమాదాల వీడియో దృశ్యాలను చూపించనున్నామన్నారు. రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పొందుపర్చామని చెప్పారు. ఈ క్లిప్పింగ్‌లలో అతి వేగంగా వెళుతున్న రైలులో యువకులు ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ పట్టు కోల్పోయి ట్రాక్‌పై పడడం లాంటి సన్నివేశాలను పొందుపరిచినట్లు వివరించారు. మరో వీడియోలో మహిళలు నడుస్తున్న రైలు కడ్డీలను పట్టుకుని పరిగెడుతూ ఎలా ఎక్కేందుకు యత్నిస్తున్నారో తదితర దృశ్యాలను బస్సుల్లోని ప్రయాణికులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బెస్ట్ చైర్మన్ ధుద్వాడ్కర్ ప్రారంభించనున్నారని రితా సావ్లా తెలిపారు. ఈ వీడియో దృశ్యాలను మొదట 25 బస్సుల్లో ఏడాది వరకు చూపించనున్నారు. ఇందులో రోడ్డు ప్రమాదాలు, వాహన చోదకులు వాహన నియమాలను ఉల్లంఘించడం వంటి దృశ్యాలను కూడా ఈ టీవీల్లో చూపించనున్నట్లు అధికారులు తెలిపారు.