రైలు ప్రమాదాలపై ‘బెస్ట్’ అవగాహన
సాక్షి, ముంబై: బెస్ట్ బస్సుల్లోని సీసీటీవీలలో రైలు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. నగర శివారులో జరుగుతున్న ఫ్రమాదాల్లో రోజూ దాదాపు 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో బెస్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ, రాధీ డిజాస్టర్ విద్యా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. కాగా ప్రయాణికులు నడుస్తున్న రైలును ఎలా ఎక్కుతున్నారు.. రైలు పట్టాలు దాటుతూ ఎలా మృత్యువాత పడుతున్నారు.. అదేవిధంగా రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. తదితర అంశాలను బెస్ట్ బస్సుల్లోని టీవీలపై చూపించేందుకు అధికారులు నిర్ణయించారు. రైళ్లలో విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని ప్రయాణికులకు తెలియజెప్పడమే తమ ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా రధి డిజాస్టర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రితా సావ్లా మాట్లాడుతూ.. మొదటి విడతలో తాము రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను బెస్ట్ బస్సుల్లోని టీవీలలో చూపించనున్నట్లు తెలిపారు. తర్వాత రోడ్డు ప్రమాదాల వీడియో దృశ్యాలను చూపించనున్నామన్నారు. రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పొందుపర్చామని చెప్పారు. ఈ క్లిప్పింగ్‌లలో అతి వేగంగా వెళుతున్న రైలులో యువకులు ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ పట్టు కోల్పోయి ట్రాక్‌పై పడడం లాంటి సన్నివేశాలను పొందుపరిచినట్లు వివరించారు.
మరో వీడియోలో మహిళలు నడుస్తున్న రైలు కడ్డీలను పట్టుకుని పరిగెడుతూ ఎలా ఎక్కేందుకు యత్నిస్తున్నారో తదితర దృశ్యాలను బస్సుల్లోని ప్రయాణికులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బెస్ట్ చైర్మన్ ధుద్‌వాడ్కర్ ప్రారంభించనున్నారని రితా సావ్లా తెలిపారు. ఈ వీడియో దృశ్యాలను మొదట 25 బస్సుల్లో ఏడాది వరకు చూపించనున్నారు. ఇందులో రోడ్డు ప్రమాదాలు, వాహన చోదకులు వాహన నియమాలను ఉల్లంఘించడం వంటి దృశ్యాలను కూడా ఈ టీవీల్లో చూపించనున్నట్లు అధికారులు తెలిపారు.