సాక్షి, ముంబై: నగరంలోని బెస్ట్ బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అయినా సదరు కాంట్రాక్టర్ గాని, బెస్ట్ అధికారులు గాని పట్టించుకోవడంలేదు. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి భద్రత దృష్ట్యా బస్సులన్నింటిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు పర్సులు పోగొట్టుకున్నా లేదా మహిళలను ఆక తాయిలెవరైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులందినా ఆయా బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను చూసి నిందితులను గుర్తించేవారు.
సాధారణంగా ఈ కెమెరాలలో 72 గంటల వరకు ఫుటేజ్ రికార్డు ఉంటుంది. వాటినే బ్యాగ్ లిఫ్టింగ్, ఉగ్రవాద కేసులకు సంబంధించిన విషయాలలో పోలీసులు సాక్ష్యాలుగా ఉపయోగిస్తారు. కాగా, కొంత కాలంగా బెస్ట్ బస్సుల్లో ఈ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం వీలుకావడంలేదు. ఇటీవల కాలంలో బెస్ట్ బస్సుల్లో దొంగల బెడద ఎక్కువగా మారింది. లక్షలాది మంది ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు, ఇతర కార్యకలాపాలకు ఈ బస్సులనే ఆశ్రయిస్తుండటంతో జేబుదొంగలకు అది వరంగా మారింది. రద్దీ సమయంలో వీరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటంతో రోజూ వేలాదిమంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఓ మిహ ళా బస్సులో చోరీ చేసింది.
కానీ ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాలేదు. సదరు మహిళ ఫిర్యాదు చేసినా నిందితుడిని గుర్తించడంలో బెస్ట్ అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుతం 2,300 బస్సుల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండగా, మిగిలిన బస్సుల్లో అవి ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31లోగా బెస్ట్‌కు సంబంధించిన అన్ని బస్సుల్లోనూ సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ నిబంధనలను పాటించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఏసీ బస్సులు సహా పలు ఇతర బస్సుల్లో ఏర్పాటుచేసిన సుమారు 1,700 కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. మిగిలిన బస్సుల్లో కూడా ఈ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుల్లో కెమెరాలను అమర్చడం వల్ల మహిళలకు భద్రత ఏర్పడుతుందని, అందుకే ఈ విషయమై పోరాటం చేస్తున్నానని బెస్ట్‌కమిటీ సభ్యుడు కేదార్ హంబల్కర్ తెలిపారు.
పనిచేయని ‘నిఘా నేత్రం’!
Published Fri, Dec 5 2014 10:17 PM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM
Advertisement