BEST Bus
-
బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమాన.. ఆ అధికారం కండక్టర్‌కే
ముంబై: ముంబై వాసులకు రవాణా సేవలందిస్తున్న బస్సుల్లో పాన్, గుట్క, పొగాకు నమిలి ఉమ్మివేసే ప్రయాణికులకు రూ.200 జరిమానా విధించాలని సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జరిమానా వసూలుచేసే అధికారం బస్సు డ్రైవర్, కండక్టర్‌కు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికున్ని పోలీసులకు అప్పగించే అధికారం కూడా వారికే కట్టబెట్టింది. దీంతో ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిల్లరాయుళ్లకు ముకుతాడు వేసినట్లైంది. బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో అనేక మందికి గుట్క, పాన్, సున్నం–తంబాకు (పొగాకు) నమిలే అలవాటుంది. సాధారణ (నాన్ ఏసీ) బస్సులో అయితే ఎక్కడైన బస్సు ఆగిన చోట లేదా అదను చూసుకుని కిటికిలోంచి బయటకు ఉమ్మివేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏసీ బస్సుల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేయడానికి ఏ మాత్రం వీలులేకుండా పోయింది. కిటికీలు, డోర్లు అన్ని మూసి ఉంటున్నాయి. ఒకవేళ ఉమ్మి వేయాలంటే కిందికి దిగాల్సిందే. దీంతో పాన్, గుట్కా నములుతున్న ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీటు కింద లేదా రెండు సీట్ల మధ్య ఖాళీగా ఉన్న స్ధలంలో మెల్లగా, ఎవరు చూడకుండా ఉమ్మి వేసి చేతులు దులుపేసుకుంటున్నారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి ప్రయాణికుల నిర్వాకంవల్ల బస్సు దుర్గంధంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి సీట్లవద్ద ప్రయాణికులు కూర్చోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. డిపోలో ఈ మరకలను శుభ్రం చేయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాన్, గుట్కా తిని ఉమ్మివేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ రూ.200 జరిమాన వసూలు చేయనున్నారు. జరిమాన చెల్లించేందుకు నిరాకరిస్తే బస్సు వెళ్లే రూట్లో మార్గమధ్యలో ఎక్కడైన పోలీసు స్టేషన్ లేదా చౌకి ఉంటే అక్కడ ఉమ్మివేసిన వారిని అప్పగించే బాధ్యతలు సిబ్బందికి కట్టబెట్టింది. అయితే ఇలా ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిళ్ల రాయుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు, జనాలను జాగృతం చేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్మెంట్ చేసే సిస్టంను అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంతమంది ప్రయాణికుల్లోనైన మార్పు వస్తుందని సంస్ధ భావిస్తోంది. -
నోట్లు మాకు.. చిల్లర మీకు
సాక్షి, ముంబై: ఇక నుంచి బస్ డిపోల్లో నోట్లు అందజేసి చిల్లర పట్టుకెళ్లండని బెస్ట్ సంస్థ కోరుతోంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. ముంబై నగరంలోని వివిధ బస్ డిపోలలో నోట్లకు బదులుగా చిల్లర డబ్బులు మార్పిడి చేసుకునే సౌలభ్యం బెస్ట్ సంస్థ కల్పించింది. దీంతో వ్యాపార సంస్థలు చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు చిల్లర కోసం బస్ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. బెస్ట్ సంస్థ బస్ చార్జీలు తగ్గించినప్పటికీ చిల్లర నాణేల బెడద పట్టి పీడించసాగింది. ప్రతీరోజు ముంబైలోని వివిధ బస్ డిపోలలో డ్యూటీ అయిపోగానే ఒక్కో కండక్టరు వేల రూపాయలు విలువచేసే చిల్లర నాణేలు జమ చేస్తున్నాడు. ఇలా నగరంలోని 24 బస్ డిపోలలో నిత్యం రూ.లక్షలు విలువచేసే చిల్లర నాణేలు బెస్ట్ ఖజానాలో పోగవుతున్నాయి. కొద్ది రోజులు ఇలాగే సాగితే వీటిని భద్రపరిచేందుకు కూడా స్థలం కొరత ఏర్పడనుంది. దీంతో వీటిని ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని లెక్కించి తీసుకునే ఓపిక బ్యాంకు సిబ్బందికి కూడా లేదు. దీంతో అవి డిపోలలోనే మూలుగుతున్నాయి. చివరకు షాపులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు చిల్లర డబ్బులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. నోట్లు తీసుకురండి, చిల్లర డబ్బులు పట్టుకెళ్లండని నినదించనుంది. షాపులకు పంపిణీ.. బెస్ట్ సంస్థ రెండు నెలల కిందట బస్ చార్జీలు తగ్గించింది. కనీస చార్జీలు రూ.8 నుంచి రూ.5కు తగ్గించింది. అంతేగాకుండా 8 కిలోమీటర్ల వరకు కనీస చార్జీలే వసూలు చేయడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీని ప్రభావం షేర్ ఆటో, ట్యాక్సీల వ్యాపారంపై తీవ్రంగా చూపింది. చార్జీలు తగ్గించకముందు ప్రతీరోజు సగటున 22–23 లక్షల మంది ప్రయాణించేవారు. చార్జీలు తగ్గించిన తరువాత ఈ సంఖ్య ఏకంగా 32 లక్షలకు పెరిగిపోయింది. భవిష్యత్తులో మరింత పెరగనుంది. దీంతో రూ.1,2,5,10 విలువచేసే నాణేలు కండక్టర్ క్యాష్ బ్యాగ్‌లో నిత్యం వేలల్లో పోగవుతున్నాయి. ప్రతీ కండక్టర్ డ్యూటీ దిగే ముందు డిపోలలో ఉన్న క్యాష్ కౌంటర్వద్ద వేలల్లో చిల్లర నాణేలు జమచేస్తున్నాడు. ఇలా ప్రతీరోజు 24 బస్ డిపోలలో రూ.11–12 లక్షల వరకు చిల్లర డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో వీటిని సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, షాపు యజమానులకు, బిగ్ బజార్, టోల్ ప్లాజా కేంద్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్ బస్ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. -
కొత్తబస్సుల కొనుగోలులో బెస్ట్‌కు సాయం చేస్తాం: బీఎంసీ
గతంలోనూ రూ. 1,600 కోట్లు అందజేత సాక్షి, ముంబై: కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వెల్లడించింది. అయితే ఈ నిధులు అప్పు రూపంలో ఇవ్వనుండటంతో ఈ మొత్తాన్ని బెస్ట్ సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నష్టాల బాటలో నడుస్తున్న సంస్థకు రుణాలు ఇచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం బీఎంసీ రూ.1,600 కోట్లు బెస్ట్‌కు అప్పుగా ఇచ్చింది. అంతేగాకుండా చార్జీలు పెంచకుండా అందులో రూ.150 కోట్లు మినహాయింపు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం బెస్ట్ సంస్థ ఆదీనంలో నడుస్తున్న 3,500 పైగా బస్సుల్లో సుమారు 300 బస్సులు పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బెస్ట్ సంస్థ రూ.700 కోట్లకుపైగా నష్టాల్లో నడుస్తోంది. చార్జీలు పెంచినప్పటికీ ఈ లోటును పూడ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 300 కొత్త బస్సులు కొనుగోలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు బీఎంసీ ముందుకు రావడంతో బెస్ట్‌కు ఊరట లభించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై స్థాయి సమితి అధ్యక్షుడు శైలేష్ ఫణసే ఆమోద ముద్రవేశారు. కాగా, ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) మాదిరిగా బెస్ట్ బస్సులపై బీఎంసీ లోగో అమర్చాలని బీఎంసీ శరతులు విధించనుంది. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న బెస్ట్ బస్సుల్లో కొన్నింటిని ఎంయూటీపీ నిధులతో కొనుగోలు చేయడంతో వాటిపై ఎంయూటీపీ లోగో ఉంది. దీంతో బీఎంసీ అందజేసిన నిధులతో కొనుగోలు చేసిన బస్సులపై ఆ సంస్థ లోగో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
బస్సెక్కితే ఏడు రూపాయలు
సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి (ఆదివారం) నుంచి చార్జీల భారం మోపనుంది. బెస్ట్ పరిపాలన విభాగం రూపొందించిన ప్రతిపాదనకు బీఎంసీ స్టాండింగ్ కమిటీ మంజూరు లభించింది. దీంతో మొదటి స్టేజీకి కనీస చార్జీ రూపాయి పెరగనుంది. ప్రస్తుతం బెస్ట్ బస్సులో కనీస చార్జీ ఆరు రూపాయలు చేస్తున్నారు. కాగా ఆదివారం నుంచి ఏడు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్, ఏసీ బస్సులకు కూడా వర్తించనుంది. చార్జీల పెంపు ప్రభావం వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలపై కూడా పడనుంది. ఆర్థికంగా నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను కొంతమేరకైనా గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెస్ట్ పరిపాలన విభాగం 2014లోనే చార్జీల పెంపు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. కానీ బీఎంసీలో అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమి రూ.150 కోట్లు ఆర్థిక సాయం అందజేయడంతో చార్జీలు పెంపు వాయిదా పడింది. ఆ తరువాత ఆగస్టులో మరోసారి చార్జీల పెంపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికలు సమీపించడం మళ్లీ వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎట్టకేలకు చార్జీల పెంపు ప్రతిపాదనకు బీఎంసీ ఆమోదం తెలిపింది. అయితే చార్జీలను రెండు విడతలుగా పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒక రూపాయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో రూపాయి మేరకు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. తొలి విడత భారం ఈ ఆదివారం ఉంచి అమలులోకి రానుంది. రెండో విడత చార్జీల పెంపు కూడా అమలులోకి వస్తే నగరంలో బెస్ట్ బస్సు కనీస చార్జీ రూ.8కి చేరుకుంటుంది. కాగా సాధారణ ప్రజలు పొందే సీజన్ పాస్‌తోపాటు వివిధ రాయితీలు పొందే సీజన్ పాస్‌లకు కూడా ఇది వర్తిస్తుందని బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బీఎంసీ పరిధి దాటి వెళ్లే ప్రయాణికులు అదనంగా మరో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌నాకా, ఇతర పన్నులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలు నిర్ణయించారు. ఏసీ బస్సు ప్రయాణికులపై అదనంగా రూ.5 భారం పడనుంది. ఇదిలాఉండగా ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులకు కనీస చార్జీలు రూ.ఆరు మాత్రమే వసూలు చేసేవారు. కాని ఆదివారం నుంచి దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా ఇదివరకు 3, 5, 7, 8, 15, 25, 35 కి.మీ.లకు ఒక స్టేజీ చొప్పున నిర్ధారించారు. ఆదివారం నుంచి 2, 4, 6, 10, 14, 20 కి.మీ.లకు ఒక స్టేజీగా నిర్ణయించారు. దీనివల్ల కొందరు ప్రయాణికులకు లాభం, మరికొందరికి నష్టం జరగనుంది. -
పనిచేయని ‘నిఘా నేత్రం’!
సాక్షి, ముంబై: నగరంలోని బెస్ట్ బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అయినా సదరు కాంట్రాక్టర్ గాని, బెస్ట్ అధికారులు గాని పట్టించుకోవడంలేదు. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి భద్రత దృష్ట్యా బస్సులన్నింటిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు పర్సులు పోగొట్టుకున్నా లేదా మహిళలను ఆక తాయిలెవరైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులందినా ఆయా బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను చూసి నిందితులను గుర్తించేవారు. సాధారణంగా ఈ కెమెరాలలో 72 గంటల వరకు ఫుటేజ్ రికార్డు ఉంటుంది. వాటినే బ్యాగ్ లిఫ్టింగ్, ఉగ్రవాద కేసులకు సంబంధించిన విషయాలలో పోలీసులు సాక్ష్యాలుగా ఉపయోగిస్తారు. కాగా, కొంత కాలంగా బెస్ట్ బస్సుల్లో ఈ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం వీలుకావడంలేదు. ఇటీవల కాలంలో బెస్ట్ బస్సుల్లో దొంగల బెడద ఎక్కువగా మారింది. లక్షలాది మంది ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు, ఇతర కార్యకలాపాలకు ఈ బస్సులనే ఆశ్రయిస్తుండటంతో జేబుదొంగలకు అది వరంగా మారింది. రద్దీ సమయంలో వీరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటంతో రోజూ వేలాదిమంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఓ మిహ ళా బస్సులో చోరీ చేసింది. కానీ ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాలేదు. సదరు మహిళ ఫిర్యాదు చేసినా నిందితుడిని గుర్తించడంలో బెస్ట్ అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుతం 2,300 బస్సుల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండగా, మిగిలిన బస్సుల్లో అవి ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31లోగా బెస్ట్‌కు సంబంధించిన అన్ని బస్సుల్లోనూ సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ నిబంధనలను పాటించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏసీ బస్సులు సహా పలు ఇతర బస్సుల్లో ఏర్పాటుచేసిన సుమారు 1,700 కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. మిగిలిన బస్సుల్లో కూడా ఈ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుల్లో కెమెరాలను అమర్చడం వల్ల మహిళలకు భద్రత ఏర్పడుతుందని, అందుకే ఈ విషయమై పోరాటం చేస్తున్నానని బెస్ట్కమిటీ సభ్యుడు కేదార్ హంబల్కర్ తెలిపారు. -
బెస్ట్ ఫస్ట్!!
ముంబై: ఆ సంస్థ పేరు ‘బెస్ట్’! ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. అయితే ‘బెస్ట్’ అనేది పేరులో మాత్రమేనని, ఆ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి ‘వరెస్ట్’గా ఉందంటున్నారు నగరవాసులు. ప్రమాదాలు చేయడంలో, బాధితులకు పరిహారం చెల్లించడం లో, రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిం చడంలో బెస్ట్ సంస్థే మొదటిస్థానంలో నిలుస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇది ఎన్నోసార్లు తేటతెల్లమైంది కూడా. 2010లో ఓ బెస్ట్ బస్ డ్రైవర్ ఉన్మాదిలా మారి వ్యతిరేక దిశలో బస్సు నడిపి రహదారిపై రణరంగమే సృష్టించాడు. 2012-13 మధ్య కాలంలో తొమ్మిదినెలల్లో కూడా బెస్ట్ డ్రైవర్లు 30కి పైగా ప్రమాదాలు చేశారు. దీనికి మరో నాలుగు నెలల ప్రమాదాలు జతకావాల్సి ఉంది. ఇక బాధితులకు బెస్ట్ సంస్థ చెల్లించిన పరిహారం విషయానికి వస్తే 2010లో ప్రమాదానికి గురైన బాధితులకు రూ.38.89 లక్షలు చెల్లించింది. ఈ విషయమై బెస్ట్ కమిటీ మాజీ సభ్యుడు రవిరాజా మాట్లాడుతూ.. ‘పరిహారాల చెల్లింపుల విషయంలో బెస్ట్ సంస్థ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అదే ప్రమాదాలు జరగకుండా ఉంటే ఆ సొమ్మును ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయొచ్చ’న్నారు. గతంలో తరచూ ఉన్నతాధికారుల తనిఖీలు ఉండేవని, ఆకస్మిక తనిఖీల్లో డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి ఏమిటో తెలిసొచ్చేదని, ఇప్పుడదంతా లేకుండా పోయిందన్నారు. అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఎంతైనా అవసరమన్నారు. సామాజిక కార్యకర్త జీఆర్ వోరా మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్లు బస్సులను చాలా నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. రోడ్డుపై తామే రాజులమనుకుంటున్నారు. సిగ్నల్స్ వద్ద కూడా ఆగడంలేదు. దీంతో పాదచారులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నార’ని ఆరోపించారు. ఈ విషయమై బెస్ట్ ప్రయాణికుల హక్కుల కార్యకర్త ఇర్ఫాన్ మచివాలా మాట్లాడుతూ.. ‘విధులు సక్రమంగా నిర్వర్తించే డ్రైవర్లకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఆ సంస్థ ఇవ్వడంలేదు. దీంతో ఎంత కష్టపడి పనిచేసినా, చేయకపోయినా అంతే వేతనం లభిస్తుందనే ఆలోచనతో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నార’న్నారు. బెస్ట్ అధికార ప్రతినిధి ఏఎస్ తంబోలి మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్ల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించాం. గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క ప్రమాదానికి కూడా బాధ్యులు కాని డ్రైవర్లకు ప్రోత్సాహం అందజేయాలని నిర్ణయించాం. ఇది మిగతా డ్రైవర్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నామ’న్నారు. -
బస్సు ఇబ్బందులపై కండక్టర్‌దే బాధ్యత!
సాక్షి, ముంబై: వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై విధి నిర్వహణలో ఉన్న కండక్టరే స్వయంగా డిపోలో ఫిర్యాదు చేయాలని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రయాణికులకు బస్సులో ఎదురయ్యే లీకేజీ, మూసుకోని, తెరుచుకోని కిటికీలు తదితర ఇబ్బందుల నుంచి త్వరలో విముక్తి లభించనుంది. వర్షాకాలం వచ్చిందంటే అనేక బస్సుల్లో టాప్ నుంచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయి. గత్యంతరం లేక ప్రయాణికులు తడుస్తూ అలాగే ప్రయాణించాల్సి వస్తోంది. కిటికీల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. కిటికీలు బిగుసుకుపోవడంతో అవి సరిగా పనిచేయవు. వాటిని మూయాలన్నా, తెరవాలన్నా పెద్ద ప్రహసనమే. ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని బస్సుల్లోనూ దర్శనమిస్తున్నాయి. బస్సు డిపోలోకి రాగానే వీటిపై సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేయాలని వర్షాకాలం ప్రారంభంలోనే కండక్టర్లందరికీ బెస్ట్ పరిపాలన విభాగం ఆదేశించింది. కాని కండక్టర్లు దాన్ని పట్టించుకోవడం లేదు. డ్యూటీ పూర్తికాగానే కండక్టరు, డ్రైవర్ బస్సును డిపోలో నిలిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన బెస్ట్ అధికారులు ఇక నుంచి ఇలాంటి ఫిర్యాదులు తప్పకుండా చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకు కండక్టర్‌కు ఒక మార్కర్ కూడా ఇచ్చారు. లీకేజీ జరుగుతున్న చోట గుండ్రంగా మార్కింగ్ చేయాలని సూచించింది. పనిచేయని కిటికీలను గుర్తించి అక్కడ కూడా ఒక గుర్తు పెట్టాలని సూచించారు. బస్సు డిపోలోకి రాగానే సంబంధిత సిబ్బందికి ఫిర్యాదుచేస్తే వారు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తారు. అయితే బస్సుల తయారీలో ఎలాంటి లోపం లేదని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు. కాగా బస్సులు బెస్ట్ అధీనంలోకి వచ్చిన తర్వాత డిపోల్లో ప్లాజ్మా టీవీలు, సీసీ కెమెరాలు, స్పీకర్లు బిగించే పనులు జరుగుతాయి. అందుకు అవసరమైన వైరింగ్ పనులకు డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో టాప్ లేదా బస్సు బాడీకి కొంతమేర హాని జరుగుతుంది. దీంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్క్ షాపులో బస్సు బాడీ తయారుచేసే సమయంలోనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని మరో అధికారి అభిప్రాయపడ్డారు.