ముంబై: ముంబై వాసులకు రవాణా సేవలందిస్తున్న బస్సుల్లో పాన్, గుట్క, పొగాకు నమిలి ఉమ్మివేసే ప్రయాణికులకు రూ.200 జరిమానా విధించాలని సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జరిమానా వసూలుచేసే అధికారం బస్సు డ్రైవర్, కండక్టర్‌కు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికున్ని పోలీసులకు అప్పగించే అధికారం కూడా వారికే కట్టబెట్టింది. దీంతో ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిల్లరాయుళ్లకు ముకుతాడు వేసినట్‌లైంది.
బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో అనేక మందికి గుట్క, పాన్, సున్నం–తంబాకు (పొగాకు) నమిలే అలవాటుంది. సాధారణ (నాన్ ఏసీ) బస్సులో అయితే ఎక్కడైన బస్సు ఆగిన చోట లేదా అదను చూసుకుని కిటికిలోంచి బయటకు ఉమ్మివేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏసీ బస్సుల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేయడానికి ఏ మాత్రం వీలులేకుండా పోయింది. కిటికీలు, డోర్లు అన్ని మూసి ఉంటున్నాయి. ఒకవేళ ఉమ్మి వేయాలంటే కిందికి దిగాల్సిందే. దీంతో పాన్, గుట్కా నములుతున్న ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీటు కింద లేదా రెండు సీట్ల మధ్య ఖాళీగా ఉన్న స్ధలంలో మెల్లగా, ఎవరు చూడకుండా ఉమ్మి వేసి చేతులు దులుపేసుకుంటున్నారు.
చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
ఇలాంటి ప్రయాణికుల నిర్వాకంవల్ల బస్సు దుర్గంధంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి సీట్లవద్ద ప్రయాణికులు కూర్చోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. డిపోలో ఈ మరకలను శుభ్రం చేయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాన్, గుట్కా తిని ఉమ్మివేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ రూ.200 జరిమాన వసూలు చేయనున్నారు.
జరిమాన చెల్లించేందుకు నిరాకరిస్తే బస్సు వెళ్లే రూట్‌లో మార్గమధ్యలో ఎక్కడైన పోలీసు స్టేషన్ లేదా చౌకి ఉంటే అక్కడ ఉమ్మివేసిన వారిని అప్పగించే బాధ్యతలు సిబ్బందికి కట్టబెట్టింది. అయితే ఇలా ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిళ్ల రాయుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు, జనాలను జాగృతం చేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్‌మెంట్ చేసే సిస్టంను అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంతమంది ప్రయాణికుల్లోనైన మార్పు వస్తుందని సంస్ధ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment