బస్సెక్కితే ఏడు రూపాయలు
సాక్షి, ముంబై: బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి (ఆదివారం) నుంచి చార్జీల భారం మోపనుంది. బెస్ట్ పరిపాలన విభాగం రూపొందించిన ప్రతిపాదనకు బీఎంసీ స్టాండింగ్ కమిటీ మంజూరు లభించింది. దీంతో మొదటి స్టేజీకి కనీస చార్జీ రూపాయి పెరగనుంది. ప్రస్తుతం బెస్ట్ బస్సులో కనీస చార్జీ ఆరు రూపాయలు చేస్తున్నారు. కాగా ఆదివారం నుంచి ఏడు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.
ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్, ఏసీ బస్సులకు కూడా వర్తించనుంది. చార్జీల పెంపు ప్రభావం వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలపై కూడా పడనుంది. ఆర్థికంగా నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను కొంతమేరకైనా గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెస్ట్ పరిపాలన విభాగం 2014లోనే చార్జీల పెంపు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది.
కానీ బీఎంసీలో అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమి రూ.150 కోట్లు ఆర్థిక సాయం అందజేయడంతో చార్జీలు పెంపు వాయిదా పడింది. ఆ తరువాత ఆగస్టులో మరోసారి చార్జీల పెంపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికలు సమీపించడం మళ్లీ వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎట్టకేలకు చార్జీల పెంపు ప్రతిపాదనకు బీఎంసీ ఆమోదం తెలిపింది. అయితే చార్జీలను రెండు విడతలుగా పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒక రూపాయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో రూపాయి మేరకు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. తొలి విడత భారం ఈ ఆదివారం ఉంచి అమలులోకి రానుంది.
రెండో విడత చార్జీల పెంపు కూడా అమలులోకి వస్తే నగరంలో బెస్ట్ బస్సు కనీస చార్జీ రూ.8కి చేరుకుంటుంది. కాగా సాధారణ ప్రజలు పొందే సీజన్ పాస్‌తోపాటు వివిధ రాయితీలు పొందే సీజన్ పాస్‌లకు కూడా ఇది వర్తిస్తుందని బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బీఎంసీ పరిధి దాటి వెళ్లే ప్రయాణికులు అదనంగా మరో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌నాకా, ఇతర పన్నులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలు నిర్ణయించారు.
ఏసీ బస్సు ప్రయాణికులపై అదనంగా రూ.5 భారం పడనుంది. ఇదిలాఉండగా ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్‌ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులకు కనీస చార్జీలు రూ.ఆరు మాత్రమే వసూలు చేసేవారు. కాని ఆదివారం నుంచి దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా ఇదివరకు 3, 5, 7, 8, 15, 25, 35 కి.మీ.లకు ఒక స్టేజీ చొప్పున నిర్ధారించారు. ఆదివారం నుంచి 2, 4, 6, 10, 14, 20 కి.మీ.లకు ఒక స్టేజీగా నిర్ణయించారు. దీనివల్ల కొందరు ప్రయాణికులకు లాభం, మరికొందరికి నష్టం జరగనుంది.